హత్రాస్ దారుణం.. జర్నలిస్ట్‌పై దేశద్రోహం కేసు - MicTv.in - Telugu News
mictv telugu

హత్రాస్ దారుణం.. జర్నలిస్ట్‌పై దేశద్రోహం కేసు

October 7, 2020

Kerala journalists' body files plea in Supreme Court over Siddique Kappan arrest

యూపీలోని హత్రాస్‌లో జరిగిన బాలిక హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘోరం జరిగిన తరువాత హత్రాస్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటన గురించి గ్రౌండ్ లెవల్‌లో రిపోర్టింగ్ చేయడానికి ఢిల్లీ నుంచి హత్రాస్ వెళ్తున్న కేరళ జర్నలిస్ట్‌ సిద్దిక్ కప్పన్‌తో పాటు మసూద్ అహ్మద్, ఆలం, అతిక్ ఉర్ రెహ్మాన్‌లను అక్టోబర్ 5న మధురాలోని మఠ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఓ కారులో ప్రయాణిస్తున్నారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

వీరికి నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ నలుగురు వ్యక్తులు భారీ కుట్రలో భాగంగా శాంతికి భంగం కలిగించేందుకు హత్రాస్ వెళ్తున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వీరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా జర్నలిస్టు సిద్ధికీ కప్పన్‌తో పాటు మరో ముగ్గురిపై యూపీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. వీరిపై 1967 అక్రమ కార్యకలాపాల చట్టం కింద కేసు బుక్ చేశారు. మధురలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఐపీసీలోని 124ఏ, ఐటీ యాక్ట్‌లోని 65, 72, 76 సెక్షన్లు, యూఏపీఏలోని 14, 17 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. జస్టిస్ ఫర్ హత్రాస్ అన్న కరపత్రాలను వాళ్లు తీసుకువెళ్తున్నట్లు ఎస్ఐ ప్రభాల్ సింగ్ ఆరోపించారు. వీరి అరెస్ట్‌ను కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖండించింది. పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యంలో జరిగిన నిరసనల తరువాత యూపీ ప్రభుత్వం పీఎఫ్ఐ సంస్థను నిషేధించింది.