లెస్బియన్ జంట ఫొటోషూట్ వైరల్! - MicTv.in - Telugu News
mictv telugu

లెస్బియన్ జంట ఫొటోషూట్ వైరల్!

November 28, 2022

‘మాకు ఇప్పుడు స్వేచ్ఛ లభించింది.. మా కలల జీవితాన్ని మేం జీవించొచ్చు’ అంటూ ప్రకటించిందో లెస్బియన్ జంట. కేరళకు చెందిన ఈ జంట ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. అదిలా నస్రీన్.. ఫాతిమా నూర ఈ ఏడాది మొదట్లో హెడ్ లైన్స్లో ఉన్నారు. కేరళకి చెందిన వీళ్లు లెస్బియన్స్. ఈ జంటను వాళ్ల తల్లిదండ్రలు బలవంతంగా విడదీశారు. దీంతో ఈ జంట కోర్టును ఆశ్రయించారు. వీరికి అనుగుణంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెండ్లికి సిద్ధమైందీ జంట. ముందుగా ఫొటోషూట్ చేసి మురిసిపోతున్నారు.

సిల్వర్ జువెలరీ.. బ్రౌన్, డీప్ బ్లూ లెహంగాల్లో అదిలా, నూర మెరిసిపోతున్నారు. ఇద్దరూ ఒకరికొకరు ఉంగరాలు, గులాబీ దండలు మార్చుకున్నారు. ఎర్నాకులంలోని సముద్ర తీరం వీరి ఫొటోషూట్ కి వేదికయింది. ‘ఎప్పటికీ కలిసి ఉండబోతున్నాం’ అంటూ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ‘ఫొటోషూట్ ఐడియా మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే వెంటనే ట్రై చేశాం. మేం ఇప్పుడే పెండ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఎప్పుడో అప్పుడు మాత్రం పెండ్లితో ఒక్కటవుతాం’ అంటున్నది నస్రీన్. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని 2018లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎల్జీబీటీక్యూ + బృందాలు, ఉద్యమకారులు దశాబ్దాల పాటు పోరాటం ఫలితంగా ఈ మార్పు వచ్చింది. అయితే ఇప్పటికీ సమాజంలో వీరి పట్ల వివక్ష ఉంటూనే ఉంది.

నూరా కుటుంబం నుంచి ఇప్పటికీ వీరికి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. నూరా, నస్రీన్ సహజీవనం చేయడానికి కేరళ హైకోర్టు అనుమతినిచ్చింది. కానీ పెళ్లయిన దంపతులకు ఉండే హక్కులు, అధికారాలు వారికి ఉండవు. ‘మేం ఏదైనా దరఖాస్తు నింపినపుడు.. భర్త లేదా తండ్రి పేరు రాయాలని ఉంటుంది. పని చేసే చోట, వేరే చోట్ల మా తండ్రి పేరునే వాడుతున్నాం. ఇటీవల ఆసుపత్రిలో కూడా ఇద్దరం తండ్రుల పేర్లు రాయాల్సి వచ్చింది. ఇది మాకు నచ్చడం లేదు’ అంటున్నది నస్రీన్.
నూరా, నస్రీన్ హై స్కూల్లో కలిశారు. అప్పటి నుంచే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. స్కూలింగ్ అయ్యాక పై చదువులకు వీరిద్దరూ మూడేళ్లు కేరళలోని వేర్వేరు జిల్లాల్లో ఉన్నారు. అయినప్పటికీ వీలు దొరికనప్పుడల్లా ఫోన్లలో మాట్లాడుకోవడం, చాట్ చేస్తుండేవారు. వీరి బందాన్ని కుటుంబం ఒప్పుకోదని అప్పుడే అర్థమయింది. దీంతో ఎల్జీబీటీక్యూ + బృందాల మద్దతు కోసం తిరిగారు. వాళ్లు ‘ముందు చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకోండి’ అని సలహాలనిచ్చాయి. ఆ సమయంలో అది వారికి కూడా కరెక్ట్ అనిపించింది. తమలాంటి వారికి కూడా వీరు ఆర్థికంగా నిలదొక్కుకోమనే సలహా ఇస్తామంటున్నారు.

కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ జంటకు లభించిన స్వేచ్ఛను తమ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘చేదు గతం ముగిసినట్లే. ఇప్పుడు అంతా బాగుంది. ఒకప్పుడు వెనుక నుంచి, కేవలం చేతుల ఫొటోలు పెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మాకు మద్దతుగా చాలామంది నిలబడ్డారనే ధైర్యం వచ్చింది. మాకు వచ్చే అభినందనల వెల్లువే దీనికి నిదర్శనం’ అంటున్నది. కానీ తమ కుటుంబాలు మాత్రం ఇప్పటికీ తమ బంధాన్ని ఒప్పుకోవడం లేదు. అదొక్కటే ఇద్దరినీ బాధిస్తున్నదట.