ఇదేందయ్యా ఇది.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేందయ్యా ఇది.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్

July 28, 2022

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం సహజమే. బైక్ లేదా కార్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ కార్డ్, హెల్మెంట్ లేకుంటే చలాన్లు వేస్తారు. అదే విధంగా రాంగ్ రూట్‌లో వెళ్లినా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్‌లైట్ పడినా ఆగకుండా వెళ్లినా, రాష్ డ్రైవింగ్ చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా.. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారు. అయితే పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ఘటన తాజాగా కేరళలో వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వస్తే..

ఐటీ ఉద్యోగి బాసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ సైకిల్‌పై కొచ్చిలోని పుక్కట్టుపడి ఏరియా నుంచి ఉదయం 10 గంటల సమయంలో ఆఫీస్‌కు వెళుతున్నాడు. వన్ వేలో ప్రయాణిస్తుండగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ బండిని ఆపి రూ. 250 చలాన్ విధించారు. శ్యామ్ ఫైన్ కట్టేసి ఆఫీస్‌కు వెళ్ళాడు. చలానాలో ఏముందోనని ఓసారి చెక్ చేయగా అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. వాహనంలో సరిపడా ఇంధనం లేనందుకు జరిమానా విధించినట్టు ఆ రసీదులో ఉంది. అధికారులు చేసిన పొరపాటుకు నవ్వుకొని బాసిల్ శ్యామ్ ఆ రసీదును తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన జులై 22న పుక్కట్టుపడి ప్రాంతంలో చోటుచేసుకుంది.

బైక్‌లో సరిపడా ఇంధనాన్ని క్యారీ చేయాలనే రూల్ భారత దేశంలో లేనే లేదు. కానీ.. కేరళలో మాత్రం.. ఆటో, కార్లు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు తప్పనిసరిగా సరిపడా ఇంధనాన్ని కలిగి ఉండాలి. లేకపోతే అక్కడి అధికారులు ఫైన్ విధిస్తారు. ఇంధనం అయిపోయి వాహనాలు ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన బైక్‌కు వర్తించదు. శ్యామ్ విషయంలో ట్రాఫిక్ అధికారి పొరపాటు పడి.. అతడు చేసిన తప్పుకు కాకుండా బండిలో సరిపడా ఇంధనం లేదనే కారణంతో చలాన్ జారీ చేశాడు. నెటిజన్లు ట్రాఫిక్ పోలీసుల తీరుపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.