Kerala: Model-cum-actress found dead in her Kozhikode flat
mictv telugu

నటి అనుమానస్పద మృతి.. పోలీసుల అదుపులో భర్త

May 13, 2022

తారాలోకంలో ఓ వెలుగు వెలుగుదామనుకున్న ఓ నటి .. తన ఆశయం నెరవేరకుండానే నేలరాలింది. అనుమానాస్పద రీతిలో ఆమె మరణించడం కేరళలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆమె మరణం వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేరళలోని కాసరగోడ్‌కు చెందిన షహనాది (20) అనే నటి, మోడల్.. చీరలు, నగలు యాడ్లతో కేరళ వాసులకు షహనా సుపరిచితం. నటిగా స్థిరపడేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుండేది. ఆమెకు ఏడాదిన్నర క్రితమే పెళ్లయింది. పెళ్లయ్యాక కోజికోడ్కు 14కి.మీ దూరంలోని పరాంబిల్ బజార్లో భర్త సజ్జద్తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. అనుకోకుండా నిన్న రాత్రి ఆమె మరణించింది. రాత్రి 11.30గంటల సమయంలో అపార్ట్మెంట్లోని కిటికీ ఊచలకు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీనిపై షహనా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెది హత్య అయి ఉంటుందని ఆరోపించారు.

తన భర్త ఎప్పుడూ తనను హింసించేవాడన్న విషయాన్ని షహనా తనకు చెబుతూ ఉండేదని ఆమె తల్లి పోలీసుల ఎదుట విలపించింది. తను ఆత్మహత్య చేసుకునే రకం కాదని, ఇటీవల తన బర్త్డే పార్టీకి రావాలని కూడా తమని పిలిచిందని వాపోయింది. హత్య ఆరోపణల నేపథ్యంలో షహనా భర్త సజ్జద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు.