Kerala: Muslim women group sets fire to hijabs in support of Iranian protesters
mictv telugu

హిజాబ్‌ వ్యతిరేక నిరసన.. ఇరాన్‌లో కాదు, మనదేశంలోనే..

November 8, 2022

గత నెల రోజులకి పైగా హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో అక్కడి మహిళలు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. హిజాబ్‌ సరిగ్గా ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మృతి చెందింది. అప్పటి నుంచి ఆ దేశంలో ఆందోళనలు మొదలుకాగా.. అక్కడి ప్రభుత్వం ఈ నిరసనలపై ఉక్కుపాదం మోపుతోంది. వందల మంది చంపబడుతున్నారు. అయినా మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హిజాబ్‌ను ఇకపై ధరించబోమని కొందరు.. జుట్టు కత్తిరించుకుని కొందరు.. మరికొందరు హిజాబ్‌ను మంటల్లో వేస్తూ కాలుస్తున్నారు. అంతే కాకుండా జట్టు కత్తిరించుకొని నిరసనలు తెలుపుతున్నారు.

అయితే తాజాగా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఫ్రీ ఇస్లామిక్ థింకర్స్ అసోసియేషన్కు చెందిన 50 మంది ముస్లిం యువతుల బృందం ఈ నిరసనలు చేపట్టింది. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావంగా ముస్లిం యువతులు ఇలా చేశారు. హిజాబ్ వస్త్రానికి నిప్పుపెట్టారు. హిజాబ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, భారతదేశంలోని ముస్లిం మహిళలు ఇరాన్ నిరసనకారులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో హిజాబ్ ధరించడం ముస్లిం మహిళల హక్కు అని చెబుతూ ఇటీవల వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రాష్ట్రంలో అదే వర్గానికి చెందిన మహిళలు హిజాబ్ వ్యతిరేక నిరసనలు తెలపడం గమనార్హం.