30 ఏళ్లలో 60 మందిపై.. టీచర్ కం కౌన్సిలర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

30 ఏళ్లలో 60 మందిపై.. టీచర్ కం కౌన్సిలర్ అరెస్ట్

May 14, 2022

ఉపాధ్యాయుడిగా ఉంటూ మంచి బుద్ధులు నేర్పాల్సింది పోయి విద్యార్ధినులపైనే అత్యాచారాలకు పాల్పడ్డాడు ఓ టీచరు. సర్వీసులో ఉండగా, భయంతో చెప్పలేకపోయిన విద్యార్ధినులు అతను రిటైర్ అవడంతో ధైర్యంగా ముందుకు వచ్చారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది సదరు కీచక టీచరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. కేవీ శశికుమార్ అనే వ్యక్తి మలప్పురం పట్టణంలోని సెయింట్ గేమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూలులో టీచరుగా పనిచేసి గత మార్చిలో రిటైర్ అయ్యాడు. సర్వీసులో ఉండగా మూడు సార్లు సీపీఎం పార్టీ తరపున కౌన్సిలర్‌గా కూడా పనిచేశాడు. అయితే రిటైరయిన వెంటనే విషయం తెలుసుకున్న దాదాపు 50 మంది విద్యార్ధినులు తమపై శశికుమార్ సాగించిన లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాక, ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. స్కూలులో ఏమైనా లోపాలు ఉన్నాయోమో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలతో శశికుమార్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయగా, సీపీఎం పార్టీ అతడిని బహిష్కరించింది.