Kerala: Snake spotted in train, creates panic among passengers
mictv telugu

రన్నింగ్ ట్రైన్‌లో పాము.. బెంబేలెత్తిన ప్రయాణికులు

July 29, 2022


అర్ధరాత్రి వేళ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులంతా హడలిపోయారు. దాన్ని వెతికి పట్టుకునేందుకు అధికారులు గంటకుపైగా రైలును నిలిపివేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం కోజికోడ్ లో జరిగింది. తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ పాము దూరిందని ప్రయాణికులు గుర్తించారు. సమాచారాన్ని రైల్వే అధికారులకు ఇవ్వడంతో గంటకు పైగా రైలును నిలిపివేసి.. పాము కోసం వెతికారు. అయితే అప్పటికీ పామును గుర్తించలేకపోయారు. బుధవారం రాత్రి తిరుర్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలులోని 55 కంపార్ట్‌మెంట్‌లోని లోయర్ బెర్త్ కింద సామాను మధ్య పాము ఉన్నట్లు ప్రయాణీకులు టీసీకి సమాచారం అందించారు. వెంటనే కోజికోడ్ రైల్వే స్టేషన్ లో గంట సేపు రైలును నిలిపివేసి మొత్తం కంపార్ట్‌మెంట్‌ వెతికారు.

గంట పాటు రైలును నిలిపివేయడంతో.. ఏం జరిగిందో మొదట ప్రయాణికులకు తెలియలేదు.. ఆ తరువాత కంపార్ట్‌మెంట్‌లో పాము ఉందనే వార్తలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోజికోడ్ రైల్వే అధికారులు, పామును గుర్తించేందుకు అటవీశాఖ నిపుణులను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ సిబ్బంది, ఇద్దరు పాములను పట్టే వ్యక్తులు.. కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులను దించేసి వెతికినా లాభం లేకుండా పోయింది. రాత్రి 10.15 గంటల వరకు పాము కోసం వెతికారు. ప్రయాణికులు ఫోన్లలో తీసిన ఫొటోలను పరిశీలించిన తర్వాత అది విషపూరితం కాని పాము అని నిర్ధరణకు వచ్చారు. రైలు నుంచి అది వెళ్లిపోయి ఉంటుందని, లేదా బోగీ పక్కన ఉన్న ఓ రంధ్రంలోకి వెళ్లి ఉండొచ్చని భావించారు. ఆ రంధ్రాన్ని మూసివేశాక రైలు బయల్దేరింది.