ఇటీవలే ట్రాన్స్ మెన్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ వైరల్ అయిన విషయం అందరికీ గుర్తింది కదా! ఇప్పుడు ఆ ట్రాన్స్ మెన్ బిడ్డను కన్నాడు. అయితే పుట్టింది.. ఆడ, మగనో మాత్రం తెలియచేయలేదు. నెల ముందుగానే బిడ్డ వచ్చేసిందని మాత్రం ప్రకటించారు.
భారతదేశంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ మొదటిసారిగా ఒక లింగమార్పిడి జంట బిడ్డకు జన్మనిచ్చింది. కేరళకు చెందిన జాహద్ అనే 23 యేండ్ల ట్రాన్స్ మ్యాన్ బుధవారం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రసవించింది. అతని భాగస్వామి 21 యేండ్ల జియా పావల్ ట్రాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. నిన్న ఉదయం 9.30నిమిషాలకు 2.90కిలోల బరువున్న శిశువు జన్మించిందని చెప్పారు. దాదాపు నెల రోజుల ముందే బిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డ ఎవరో మాత్రం తాము తెలియదలుచుకోలేదని స్పష్టం చేశారు.
మొదటి ట్రాన్స్ పేరెంట్స్..
ఈ జంట భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్ పేరెంట్స్. ఈ జంట గత మూడు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. వారి పరివర్తన ప్రక్రియలో భాగంగా హార్మోన్ థెరపీ చేయించుకుంటున్నారు. అయితే ఆడపిల్లగా జన్మించిన జహద్ ఫాజిల్ దంపతులు తల్లిదండ్రులు కావాలని కోరుకోవడంతో గర్భవతి కావడానికి తన పరివర్తన ప్రక్రియను నిలిపివేశాడు. మొదట దత్తత తీసుకోవడానికి ప్లాన్ చేసినప్పటికీ చట్టపరమైన విధానాలు కష్టంగా ఉన్నందున ఈ జంట ఆ ఆలోచనను నిలిపివేసుకున్నది.
పాలు అందిస్తామని..
పుట్టిన బిడ్డకు పాలు అందిస్తామని ఆసుపత్రి హామీ ఇచ్చింది. పరివర్తన ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జహాద్ రొమ్ములను తొలగించేశారు. అందుకే అక్కడ ఉన్న పాల బ్యాంకు నుంచి శిశువుకు తల్లిపాలు అందుబాటులో ఉంచుతామని వైద్య కళాశాల అధికారులు వారికి హామీ ఇచ్చారు. జహాద్ అకౌంటెంట్ కాగా, జియా డ్యాన్స్ టీచర్.
ట్రాన్స్ కమ్యూనిటీ..
భారత్ లో 20 లక్షల మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారని అంచనా. ఇతర ప్రజలు పొందే హక్కులన్ని ట్రాన్స్ జెండర్స్కి వర్తిస్తాయని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే విద్య, వైద్య సౌకర్యాలు పొందడంలో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేరళలోని లింగమార్పిడి సంఘం కూడా ఈ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేశారు. అంతేకాదు.. దేశంలోని తొలి ట్రాన్స్ జెండర్ పైలట్ అయిన ఆడమ్ హ్యారీ.. తన జీవితంలో ఇంతటి ఆనందాన్న అనుభవించలేదన్నారు. ట్రాన్స్ జెండర్ కార్యకర్త శీతల శ్యామ్ ఈ జంట ఫోటోలను పంచుకొని తన ఆనందాన్ని తెలియచేశారు. ఇలా వీరే కాదు.. చాలామంది వీరు, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.