భారతీయ కార్మికుడికి రూ. 24 కోట్ల లాటరీ
కష్టకాలంలో ఓ వ్యక్తిని లాటరీ రూపంలో మహాలక్ష్మీ కటాక్షించింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడు అయ్యాడు. అబుదాబిలో పని చేసే భారతీయుడికి లాటరీ టికెట్ తగిలి ఏకంగా రూ. 24.60 లక్షలు ( 12 మిలియన్ దిరామ్స్) గెలుచుకున్నాడు. ఊహించని విధంగా అతనికి జాక్ పాట్ తగలడంతో అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఇంత కాలం పాటు పడిన కష్టాలు అన్ని తీరిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన హుస్సేన్ ముజిప్పురత్(47) అనే వ్యక్తి అజ్మాన్‌లోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. దాదాపు 28 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటూ పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కరోనా కారణంగా అతను సొంత గ్రామానికి రావాల్సి వచ్చింది. వచ్చే సమయంలో మే 14వ తేదీన లాటరీ కొనుగోలు చేశాడు. అంతకు ముందే నాలుగైదు సార్లు కొని భంగపడ్డాడు. అయినా కూడా నమ్మకంతో కొనుగోలు చేయగా.. అతనికే ఆ జాక్ పాట్ తగిలింది. తాజాగా హుస్సేన్ కొన్న 139411 గల లాటరీ నంబర్‌కు అదృష్టం వరించింది. ముందుగా నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పగా నమ్మలేదు. ఆ తర్వాత నంబర్ పంపించడంతో నిజమేనని తెలిసి ఆనంద పడిపోయాడు. వచ్చిన డబ్బులో కొంత పేదల సాయం కోసం ఉపయోగించి మిగిలిన వాటితో తన ఇద్దరు కుమార్తెలకు మంచి భవిష్యత్ అందిస్తానని తెలిపాడు.