తమ్ముడి అలక.. గిన్నిస్ రికార్డ్‌పై కన్నేసిన అక్క
మొబైల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు రాయడమే మరచిపోయాం. ఏం రాయాలన్నా కీబోర్డుతో రాసి కంటికి కనిపించని మార్గంలో సెండ్ చేసేస్తున్నాం.. కానీ ఓ యువతి.. తన ప్రియమైన తమ్ముడి అలక తీరుద్దామని అతనికో ఉత్తరం రాసింది. తమ చిన్ననాటి మధురస్మృతులను అక్షరాలుగా రాసి ఉత్తరం ద్వారా సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా 434 మీటర్ల పొడవున ఓ ఉత్తరం రాసి సంచలనం సృష్టించింది.
కేరళకు చెందిన కృష్ణ ప్రియ.. ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె తమ్ముడు కృష్ణ ప్రసాద్.. బ్రదర్స్ డే రోజున తన అక్క శుభాకాంక్షలు చెప్పలేదని అలిగాడు. మర్చిపోయావ్ అంటూ వాట్సప్ మెసేజ్ పెట్టగా.. అతనికి కాల్ చేసింది కృష్ణప్రియ. కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేయడంతో.. ఉత్తరం ద్వారా బుజ్జగిద్దామనుకుంది. తమ్ముడంటే తనకు ఎంత ప్రేమో, తమ్ముడి కోసం తానే ఏమేం చేశానో, చిన్నప్పటి నుంచి ఎలా చూసుకున్నానో చెప్తూ.. ఒక్కొక్క పేపర్ పై రాస్తూ.. అలా వరుసగా 15 బండిల్స్ కొనుక్కొచ్చి రాసింది.
అవన్నీ రాశాక.. ఒకదాని వెనుక ఒకటిగా అతికించగా మొత్తం 434 మీటర్ల పొడవుతో ఉత్తరం తయారైంది. తమ్ముడికి పోస్టు చేద్దామని పోస్టాఫీసుకు వెళితే.. వారు దాన్ని తూకం వేసి 5కిలోల 270 గ్రాముల బరువున్నట్టు తేల్చి.. ఆ మేరకు చార్జీ వేశారు. రెండు రోజుల తర్వాత తనకు చేరిన ఆ ఉత్తరాన్ని చూసి తమ్ముడు ఆశ్చర్యపోయాడు. తన మీద అక్కకున్న ప్రేమను చూసి సంబురపడుతూ.. స్నేహితులందరికీ చెప్పుకొన్నాడు. మరో విశేషం ఏమిటంటే.. ఇంత పెద్ద ఉత్తరాన్ని ‘వరల్డ్ లాంగెస్ట్ లెటర్’గా రికార్డు కోసం గిన్నిస్ బుక్ కు కృష్ణప్రియ దరఖాస్తు చేసుకుంది.