హైబ్రీడ్ విత్తనాల వల్ల దేశీ వరి వంగడాలు నష్టపోతున్నాయి. దీని గురించి కేరళకు చెందిన చెరువాయల్ రామన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాబట్టి అతను దేశీయ వరిని సాగు చేయడం, వాటి విత్తనాలను సంరక్షించడం ప్రారంభించాడు.
వాయనాడ్ లోని కురిచియాస్ లో జన్మించాడు రామన్. జీవితంలో ఎక్కువ భాగం వరి సాగు చేస్తూ జీవించాడు. గ్రామంలో దేశవాళీ వరి స్థానంలో హైబ్రీడ్ విత్తనాలు వేయడానిని చూసిన అతను తన పొలంలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో దేశీ విత్తనాలను నాటాలని నిర్ణయించుకున్నాడు. అసలు రామన్ పదేళ్ల వయసులోనే వరి సాగు చేయడం ప్రారంభించాడు. కానీ అతని మామ 1969లో మరణించడంతో అతనికి 40 ఎకరాల భూమి వచ్చింది. అప్పుడే పూర్తిగా వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు. ఇప్పుడు రామన్ వరి రకాలను కేవలం చూపుతోనే గుర్తించగలడు.
తనే స్వయంగా..
‘నేను 2000ల ప్రారంభంలో ఈ మార్గాన్ని ప్రారంభించాను. వయనాడ్ వరి సాగుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కానీ మన స్థానిక వరి రకాలు హైబ్రీడ్ల విత్తనాల వల్ల నష్టం కలుగుతుంది. 150 యేండ్ల నాటి వెలియన్, చెంబకం, తొండి, చాన్నల్తొండి, చెట్టు వెలియన్, పాల్వెలియన్, కనాలి వంటి దేశీయ వరి రకాలను, గంధకశాల, జీరకసాల, కాయమా వంటి సుగంధ వరి రకాలను నిల్వ చేస్తున్నా. ప్రతి పంట తర్వాత ముందు నేనే అన్ని విత్తనాలను శుభ్రం చేసి పొడిగా ఉంచుతాను. అది రెట్టింపు అవుతుంది. నేను ప్రతీ సంవత్సరం అవిశ్రాంతంగా పని చేస్తున్నా. 20 సంవత్సరాల్లో 54 రకాల వరి వంగడాలను దాచి పెట్టాను’ అని అతను చెప్పాడు.
ఒక షరతుతో..
అతని విజయాల పట్ల ఆసక్తితో ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అతని సాంకేతికతలను తెలుసుకోవడానికి వస్తారు. అలాగే 72 యేండ్ల రైతు తన విత్తనాలను విక్రయించడు. కానీ ఒక షరతు పై మాత్రమే ఇస్తాడు. విత్తనాలను అరువుగా తీసుకున్న వ్యక్తి పంట కోత తర్వాత వారి పొలం నుంచి అదే పరిమాణంలో విత్తనాలను తిరిగి ఇవ్వాలి. రామన్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు, కేరళ ప్రభుత్వం పీకే కలాన్ అవార్డు వంటి వివిధ అవార్డులను గెలుచుకున్నాడు.