ఇక్కడ ఉపాధి లభించడం లేదని ఎందరో పొట్ట చేతబట్టుకుని, పెళ్లాంబిడ్డలను ఇక్కడే వదిలి విదేశాలకు వలస వెళ్తున్న వారు ఎందరో. అరబ్ దేశాలే కాకుండా చాలా విదేశాల్లో మన భారతీయులు ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అయితే బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నవారి విషయం వదిలేస్తే.. ఏం చదువుకోకండా లేబర్, కంపెనీ వీసాల మీద వలస వెళ్లేవారి పరిస్థితి అక్కడ చాలా దారుణంగా ఉంటుంది. సకాలంలో పనులు దొరకవు. ఏజెంట్ మోసం చేయడంతో అక్కడ వారు పడే పాట్లు కోకొల్లలు. ఈ క్రమంలో ఇక్కడ పెరిగిన అప్పులకు వడ్డీలు కట్టలేక భార్యాబిడ్డలు నానా అవస్థలు పడుతుంటారు. కుటుంబం పడుతున్న బాధల గురించి తెలుసుకుని ఆ దిగులుతో అక్కడ గుండెపోటు వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు. ఈ క్రమంలో వారి మృతదేహాలు భారత్కు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అరబ్ దేశాల నిబంధనల ప్రకారం శవాన్ని అక్కడే ఖననం చేస్తే అక్కడి ప్రభుత్వం బాధిత కుటుంబానికి డబ్బులు ఇస్తుంది.
కొంతమంది రాజీపడి డబ్బులు తీసుకుని తమవారి కడచూపుకు కూడా నోచుకోవడం లేదు. కొందరేమో ఎంత కష్టమైనా మృతదేహాన్ని అక్కడినుంచి మాతృగడ్డకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చనిపోయినవారిని అంత్యక్రియలు అయ్యాయంటే మళ్లీ చూడలేం. కడసూపును గుండెల్లో దాచుకోవడం తప్ప మరేం చేయలేం. ఇప్పటికి ఇలాంటి విషాదాలు ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మృతుల కుటుంబాల కన్నీరు తుడవడం ఎవరి తరమూ కాదు. కానీ, ఒక్కడున్నాడు. మృతుల కటుంబాలకు కడచూపు కల్పిస్తాను అంటున్నాడు ఆయన. దేశం కాని దేశం పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది మృతదేహాలను స్వగ్రామాలకు చేరుస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు ఓ వ్యక్తి. కేరళకు చెందిన ఆయన పేరు అఫ్రాష్. ఆయన యూఏఈలో స్థిరపడ్డారు. పొట్టకూటి కోసం భారత్ నుంచి యూఏఈకి వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది భారతీయుల మృతదేహాలను అష్రాఫ్ వారి స్వగ్రామాలకు పంపుతున్నారు. తన సొంత ఖర్చులతోనే ఆయన ఇదంతా చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి ఆయన ఈ పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 5,700 మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు పంపించారు.