అయ్యప్ప దర్శనం 250 మందికే... ఇదీ పరిస్థితి  - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప దర్శనం 250 మందికే… ఇదీ పరిస్థితి 

October 17, 2020

Kerala’s Sabarimala temple reopens: Covid-19 negative proof, online booking must for entry

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు అన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. ఆలయాలు వరుసగా ఏడు నెలలు మూతపడటంతో భక్తులు ఇళ్లల్లోనే తమ ఇష్టదైవాలను ప్రార్థించుకున్నారు. శబరిమలలో ఉన్న అయ్యప్ప ఆలయానికి వేలాదిగా భక్తులు దర్శించుకునేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది భక్తులను పంపడానికి ఆలయ నిర్వాహకులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కేరళలో రెండోసారి కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. కఠినమైన కరోనా నిబంధనల నడుమ 7 నెలల తర్వాత తొలిసారిగా శబరిమల ఆలయం శుక్రవారం తెరచుకోగా భక్తులను మితంగా అనుమతించాలని భావిస్తున్నారు. ఈరోజు నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా.. రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదివరకే కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. వారం ప్రారంభంలో 1000 మంది, వారాంతాల్లో 2 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. వర్చువల్‌ క్యూలో వివరాలు నమోదు చేసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం దర్శనానికి కేవలం 246 మంది మాత్రమే నమోదు చేసుకోవడంతో అధికారులు దర్శనాల సంఖ్యను 250కి కుదించారు. 

ఈ మేరకు పక్కా మార్గదర్శకాలను రూపొందించారు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారికి మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. స్వామివారికి నెలవారీ పూజలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. అనంతరం నవంబర్‌ 16 నుంచి అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా స్వామివారికి నెయ్యాభిషేకం, భక్తులకు అన్నదానాలను రద్దుచేశారు. అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదని వివరించారు. పంపా నదిలో స్నానాలను తాత్కాలికంగా నిలిపివేసి, భక్తుల స్నానాలకు వీలుగా అక్కడ షవర్లను ఏర్పిరిచారు. సన్నిధానంలో రాత్రి బస చేసేందుకు వీలు లేదని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు.