Key decision of KCR Sarkar..Dalit bandhu in 118 constituencies
mictv telugu

కేసీఆర్ సర్కార్ నిర్ణయం..118 నియోజకవర్గాల్లో దళిత బంధు

September 4, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది దళిత బంధు పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన వందమంది లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి దళితు బంధును అందజేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన 1,500 మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా తొలిదశలో 500 మంది అర్హులైన లబ్దిదారులను తక్షణం ఎంపిక చేసి, దళితబంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో 1,500 మందికి దళితబంధును అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

”ప్రస్తుతం హూజూరాబాద్‌లో ఈ పథకం అమల్లో ఉంది. ఇకపై మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మొదలౌతుంది. మొత్తం 1,77,000 మందికి దళిత బంధు వర్తించనుంది. తొలి దశలో 500 మంది చొప్పున తక్షణం 59వేల మందికి ఈ దళితబంధు అందించున్నాం. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగిస్తాం” అని క్యాబినెట్ ఆదేశించింది.