Key decision of Telangana government. Operations are there
mictv telugu

ఇకపై కు.ని. ఆపరేషన్లు పెద్దాసుపత్రుల్లోనే: హరీష్ రావు

September 5, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇబ్రహీంపట్నంలో కు.ని. ఆపరేషన్లు వికటించి, నలుగురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని, మళ్లీ అలాంటి ఘటనలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగకుండా ఉండేందుకు.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కు.ని. ఆపరేషన్లు పెద్దాసుపత్రుల్లోనే జరుగుతాయని వైద్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మత్తు మందు వైద్యులు, ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సౌకర్యమున్న పెద్దాసుపత్రుల్లోనే ఇక నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని ఆదివారం అధికారులను ఆయన ఆదేశించారు.

ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనపై ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ..”ఇబ్రహీంపట్నంలో గంటన్నరలోనే 34 మందికి కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లు విచారణలో తెలిసింది. ఆపరేషన్‌కు, ఆపరేషన్‌కు మధ్య పరికరాలను శుభ్రంగా చేసేందుకు అవసరమైన సమయం కూడా తీసుకోలేదు. ఇన్ఫెక్షన్‌ వల్లనే బాధితులు మృతిచెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది” అని అధికారులు తెలిపారు.

అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ..’అంత హడావిడిగా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. మహిళల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించకుండానే పంపించడం ఏంటి? ఇకనుంచి ఆపరేషన్లు అయిన మహిళలను ఆసుపత్రుల్లో ఒకరోజు పరిశీలనలో ఉంచి, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించాకే, ఇంటికి పంపించాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా సంబంధిత జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగే ఆసుపత్రులను పరిశీలించి, లోపాలను సరిదిద్దండి” అని ఆయన అన్నారు.