కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పటికీ నుంచి ప్రజలు మాంసాహారం ఎక్కువగా తింటున్నారు. దీంతో చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ చికెన్ రూ. 260 పలుకుతోంది. అలాగే కేజీ మటన్ ఏకంగా రూ. 1200లకు ఎగబాకింది. దీంతో సామాన్యులు మటన్ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో జి.కొండూరులో ఓ మటన్ వ్యాపారి సోమవారం నాడు కిలో రూ.200 అని బోర్డు పెట్టాడు. దీంతో జనాలు ఆ షాపుకి ఎగబాకారు.
ఆ షాపు యజమాని ఓ కండిషన్ కూడా పెట్టాడు. ఆధార్ కార్డు ఉన్నవారికే ఈ ఆఫర్ అని తెలిపాడు. దీంతో ప్రజలు ఆధార్ కార్డు తీసుకుని వెళ్లారు. అలాగే ఇరుగుపొరుగు వాళ్ల ఆధార్ కార్డులు పట్టుకొచ్చి మటన్ కోసం బారులు తీరారు. అయితే చౌకగా అమ్మిన మాంసం చచ్చిన గొర్రెలదంటూ కొందరు ప్రజలు ఆరోపిస్తున్నారు. రోగాలతో చచ్చిన గొర్రెలను తెచ్చి అమ్మకాలను పెంచుకునే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.