కేజీఎఫ్ ఎఫెక్ట్.. థియేటర్లో కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

కేజీఎఫ్ ఎఫెక్ట్.. థియేటర్లో కాల్పులు

April 20, 2022

22

కేజీఎఫ్ సినిమా చూస్తున్న ఇద్దరు యువకులు సీటు మీద కాలు వేసిన కారణంగా గొడవపడి తుపాకీతో కాల్చే వరకు వెళ్లింది. కర్ణాటకలోని హవేరి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేజీఎఫ్ 2 సినిమా చూస్తుండగా ఓ యువకుడు ముందు సీటుపై కాలు పెట్టాడు. ఈ విషయంపై కాలు పెట్టిన వ్యక్తి, ముందు సీటులో కూర్చున్న వ్యక్తి ఇద్దరూ గొడవపడ్డారు. గొడవ పెద్దదవడంతో ముందు సీటులో కూర్చున్న వ్యక్తి బయటికి వెళ్లి తుపాకీతో తిరిగి వచ్చాడు. కోపంతో సీటుపై కాలుపెట్టిన వ్యక్తిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు పొత్తికడుపులో దూసుకుపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో బేంబేలెత్తిన తుపాకీ యువకుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఇది చూసి సినిమా చూస్తున్న ప్రేక్షకులు భయాందోళనకు గురయి, గాయపడిన యువకుడిని హుబ్బళ్లిలోని ప్రేవేటు ఆస్పత్రకి తరలించారు. చికిత్స అనంతరం ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాగా, సీటు గొడవ తుపాకీ కాల్పుల వరకు వెళ్లిందంటే అది సినిమా ప్రభావమేనని ప్రత్యక్షసాక్షులు అభిప్రాయపడుతున్నారు.