సంచలన కేజిఎఫ్ లో నటించిన కన్నడ సీనియర్ నటుడు కృష్ణ జి రావు ఆరోగ్యం క్షీణించింది. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ సినిమాల్లో అంధుడైన వృద్ధుడి పాత్రలో నటించి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న కృష్ణ జి రావు శ్వాశ సంబంధిత సమస్యలతో గత కొద్ది కాలంగా బాధపడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఈయన పాత్ర నిడివి తక్కువే అయినా కేజిఎఫ్ చిత్రాల విజయం తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయారు. ఇక అప్పటినుంచి సినిమా అవకాశాలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు.
ఇక KGF నటుడు కృష్ణ జి రావు త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు సన్నిహితులు ప్రార్థిస్తున్నారు. కృష్ణ జీ రావు చిన్న పల్లెటూరులో పుట్టారు. నటన మీద ఆసక్తితో 30 ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చారు. టైలర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇలా చాలా పనులు చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు కథా రచన కూడా చేశారు. ఇలాంటి సమయంలోనే ప్రొవిజినల్ మేనేజర్ కుమార్ కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణాజీని అడిగారు. కానీ, ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండి యాక్టింగ్ నాకెందుకు అనుకున్నారు. అయితే, ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణాజీ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన కేజీఎఫ్‌కు సెలెక్ట్ అయ్యారు.