సోమవారం తొలిపూజకు సిద్ధమైన ఖైరతాబాద్ గణపయ్య..
61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువుతో హైదరాబాద్ ఖైరతాబాద్ గణనాథుడు పూజలకు సిద్ధమయ్యాడు. ఈసారి ‘ద్వాదశ ఆదిత్య మహాగణపతి’ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నాడు గణపయ్య. మహా గణపతి విగ్రహ పనులన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయని గణేష్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం తొలి పూజ జరగనుందని అన్నారు. పండగకు ముందే భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు.
ఇంకా పండగకు రెండు రోజులు వున్నా భక్తులు అప్పుడే ఖైరతాబాద్‌కు వచ్చి మహా గణపతి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో నగర పోలీసులు అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. వీకెండ్ అవడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వున్నందున బారికేడ్లు పెట్టి.. భక్తులను క్యూలో దర్శనానికి అనుమతిస్తున్నారు. వాహనాలు నడిపేవారు.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కాగా, గత ఏడాది శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతిగా వెలిసిన గణనాథుడు ఈసారి ద్వాదశ ఆదిత్య గణపతిగా దర్శనం ఇస్తున్నాడు. ఆ గణపతి 57 అడుగులు వుండగా ఈసారి 4 అడుగులు పెంచారు.