ఖైరతాబాద్ గణపయ్యకు కళ్లుచెదిరే కండువా - MicTv.in - Telugu News
mictv telugu

ఖైరతాబాద్ గణపయ్యకు కళ్లుచెదిరే కండువా

August 30, 2019

Khairatabad Ganesh Kanduva.

గణేష్ నవరాత్రుల్లో ఖైరతాబాద్ మహా వినాయకుడికి చేసే ప్రతిది ఎంతో ప్రతిష్టాత్మకమే. వేలాదిగా భక్తులు వచ్చి దర్శించుకునే బొజ్జ గణపయ్యను ప్రత్యేకంగా అలంకరిస్తారు. దాని లడ్డూను కూడా ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొని వస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వినాయకుడి మెడలో ఉండే అతిపెద్ద కండువాకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా మగ్గంపై నేయించి విగ్రహ ప్రతిష్టాపన రోజున ఊరేగింపుగా తీసుకువచ్చి మెడలో వేస్తారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పార్క్‌లో గత ఐదేళ్లుగా దీన్ని తయారు చేస్తున్నారు. ఈసారి కూడా చేనేత కార్మికులు నెల రోజులపాటు శ్రమించి కండువాను తయారు చేశారు. 25 మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో ఏకవస్త్ర కండువాను నేశారు. దీనిపై శివలింగం, డమరుకం, తామర, బాణం, త్రిశూలం,కలశం, ఓంకారం,పుష్పం, స్వస్తిక్ గుర్తులతో అలంకరించారు. ఖైరతాబాద్ వినియకుడికి ఏక వస్త్రంతో కండువా తయారు చేయించి ఇవ్వడం సంతోషంగా ఉందని  పార్క్‌ ఛైర్మన్‌ కడవేరు దేవేందర్‌ తెలిపారు.