ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకున్న వాహనాలకు సంబంధించి మొత్తం చలాన్లను చెల్లించినట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్‌నాయక్ ఆదివారం తెలిపారు. ఆయనకు చెందిన అయిదు వాహనాలపై 66 చలాన్లు ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ. 37,365 చెల్లించినట్లు వివరించారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఆ సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం కారు అటుగా వచ్చింది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం అని చెప్పగానే దాన్ని వదిలేశారు పోలీసులు. ఈ క్రమంలోనే కారుపై రూ.5175 చలానాలు ఉన్నా కూడా పట్టించుకోవడం లేదని విమర్శలకు తావిచ్చింది. ట్రాఫిక్ పోలీసుల తీరును పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దానం తనకున్న వాహనాలకు సంబంధించిన చలాన్లను చెల్లించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.