తొలి నిమజ్జనం ఖైరతాబాద్ మహాగణపతిదే
గణేష్ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఘనంగా భక్తుల పూజలందుకున్న గణేశుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్‌లో వినాయక చవితి మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనాలు మొదలవుతాయి. ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో 12వ తేదీ గురువారం రోజున పెద్ద ఎత్తున గణేశుల నిమజ్జనం కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
కాగా, ఈసారి కూడా ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసేంత వరకు ఇతర విగ్రహాల నిమజ్జనాలను ఎక్కడికక్కడ ఆపి వేయనున్నారు. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమయ్యే మహా గణపతి శోభా యాత్ర ట్యాంక్ బండ్ చేరుకునే సరికి ఉదయం 11 గంటలు దాటే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 45 టన్నులకు పైగా బరువు, 61 x 27 సైజులో ఉన్న ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేర్చడానికి నిర్వాహకులు చాలా కష్టపడతారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించడానికి పోలీస్ శాఖ పలు చర్యలు తీసుకొంటుంది. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. గురువారం నాడు నిమజ్జనం జరగనుండగా ఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.