ఇటీవల తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం వేదికగా మారుతోంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించగా, అటు తెలుగు దేశం పార్టీ కొద్ది రోజుల ముందు బహిరంగ సభను నిర్వహించింది. ఇప్పటికే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. పై పరిణామాలతో ఖమ్మం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షర్మిలతో భేటీ కావడం జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఆయన ఆవిర్భావ సభకు దూరంగా ఉన్నారు.
అంతేకాక తరచూ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తూ వస్తున్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న పొంగులేటి ఇటీవల తన వర్గం కార్యకర్తలు, నేతలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. అయితే బీజేపీలో జాయిన్ అవుతారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీలో ఏం మాట్లాడారనే విషయం బయటికి రానప్పటికీ పార్టీ మారుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే షర్మిలకు తెలంగాణలో బిగ్ ఎంట్రీ దొరికినట్టేనని భావిస్తున్నారు.