పొట్టకూటి కోసమో, అప్పులు తీర్చడానికో పరాయి దేశాలకు వెళ్తున్న బతులకులు అక్కడే ముగిసిపోతున్నాయి. తెలంగాణ జిగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఖతర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను పనిచేసే కంపెనీ జీతాన్ని భారీగా తగ్గిండంతో మరోదారి లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘అమ్మకు డబ్బులు పంపలేకపోతున్నాను. మా అమ్మను, నాన్నను, తమ్ముణ్ణి బాగా చూసుకోండ్రి’ అని మిత్రులకు వాట్సాప్ మేసేజ్ పంపి బుధవారం రాత్రి ప్రాణం తీసుకున్నాడు.సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన తోట నాగరాజు(24) ఖతార్‌కు ఐదేళ్లుగా వెళ్లి వస్తున్నాడు. అతనికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు శంకర్, కళావతి సంబంధం కూడా చూశారు. నాగరాజు ఖతర్ లో వాహనాల క్లీనింగ్ పనులు చేస్తున్నాడు. అతనికి కంపెనీ నెలకు 500 దిర్హమ్స్ (రూ.8779) చెల్లించాలనే ఒప్పందం ఉంది. కానీ యంత్రాలు చెడిపోయాయంటూ నెలకు 100 దిర్హమ్స్(రూ.1756) ఇస్తామని చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం రాత్రి కంపెనీ ఆవరణలోనే ఉరేసుకుని చనిపోయాడు.