ఏపీ నుంచి తమిళనాడుకు కియా..రాయిటర్స్ సంచలన కథనం   - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ నుంచి తమిళనాడుకు కియా..రాయిటర్స్ సంచలన కథనం  

February 6, 2020

kia.....01

మేడిన్ ఆంధ్రా పేరుతో కార్ల తయారీని ప్రారంభించిన కియా మోటార్స్ తన సంస్థను మార్చే పనిలో ఉందనే కథనాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏపీ నుంచి చెన్నైకి ఈ సంస్థ తరలిపోనుందని రాయిటర్స్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పారిశ్రామిక విధానాలు ఆకట్టుకునేలా ఉండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అనంతపురంలో ఏర్పాటు చేసిన రూ. 7,387 కోట్ల ప్లాంట్ తరలించనున్నట్టు పేర్కొంది. 

ఈ అంశం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టుగా పేర్కొంది. రెండేళ్ల పాటూ నిర్మించిన ఈ ప్లాంట్ తరలింపు వెనక ఏపీలో ఎదుర్కోంటున్న ఇబ్బందులే కారణమని చెప్పుకొచ్చింది. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో పాటు ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన మార్పులు ఆ సంస్థ ఉత్పత్తికి ఇబ్బందిగా మారిందట. దీంతో పాటు ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ జోరుగా ఉంది. వాహనాల విడిభాగాలు అక్కడి నుంచి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. దీంతో సప్లైయర్లకు దగ్గర అయ్యేందుకు వీలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాయిటర్స్ పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల కిందటే.. కియా తన తొలి కారును రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌కి ఏటా 3 లక్షల కార్లను తయారుచేసే సత్తా ఉంది. దీని వల్ల 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ తరలిపోతుందనే కథనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఇది ఎప్పటికల్లా తరలిపోతుందనే విషయాన్ని మాత్రం రాయిటర్స్ స్పష్టంగా వెల్లడించలేదు. అదే కంపెనీకి చెందిన మరో కంపెనీ హ్యూందయ్ మోటార్స్ కంపెనీ నిర్వాహకులు. చర్చలు జరిపినట్టుగా తెలిపింది. 

ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. దీంట్లో భాగంగానే కియా ప్రతినిధులు ఇప్పటికే అక్కడి ప్రభుత్వ పెద్దలతో సంప్రధింపులు కూడా జరిపారని చెప్పింది. వచ్చే వారం సెక్రెటరీ స్థాయిలో చర్చలు కూడా జరగనున్నాయట. ఆ తర్వాత ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

రాయిటర్స్ కథనాన్ని కియా ప్రతినిథులు ఖండించారు. దాంట్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తాము ఏపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ కూడా స్పందించారు. ఆ కథనం అంతా అవాస్తవమని కొట్టిపారేశారు.