'Kidnapped' AAP Surat candidate withdraws nomination
mictv telugu

ఆప్ అభ్యర్థి కిడ్నాప్.. చివరికి యూ టర్న్..

November 17, 2022

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభ్యర్థి కంచన్‌ జరివాలా కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన బీజేపీ ముందు తన ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని కేజ్రీవాల్కు హితవు పలికింది. ఇంతలోనే అనూహ్య పరిణామం జ‌రిగింది. మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన కంచన్‌, బుధవారం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. త‌న నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు. కంచన్‌ కనిపించడం లేద‌ని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేసిన కొద్ది గంటల తర్వాత నామినేషన్‌ ఉపసంహరణ జరిగింది.

ఈ కిడ్నాప్‌ వ్యవహారం హైడ్రామా గురించి సదరు అభ్యర్థి కంచన్‌ జరివాలా మీడియాతో మాట్లాడుతూ.. సొంతపార్టీ పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు. నామినేషన్‌ ఉపసంహరణకు ఎవరి నుంచీ ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు. నా అంతరాత్మ ప్రబోధానుసారం నామినేషన్‌ వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు నన్ను నిలదీశారు. దేశ వ్యతిరేక, గుజరాత్‌ వ్యతిరేక భావజాల పార్టీ తరఫున ఎందుకు పోటీ చేస్తున్నావని ప్రశ్నించారు. దీనిపై నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను. వారి వాదన నిజమే అనిపించింది. అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాను అని కంచన్‌ జరివాలా వివరించారు.