‘ప్లీజ్, నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు, లొంగిపోతా’- ప్లకార్డుతో గూండా - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్లీజ్, నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు, లొంగిపోతా’- ప్లకార్డుతో గూండా

March 16, 2022

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ రికార్డు స్థాయిలో రెండోసారి ఎన్నికల్లో గెలుపొందడానికి గల కారణాలలో ముఖ్యమైంది అక్కడ శాంతిభద్రతలు నెలకొల్పడం. దానికి సాక్ష్యంగా గతంలో అనేక సంఘటనలు జరిగాయి. ఆ కోవలో భాగంగా తాజా ఘటన జరిగింది. ఓ గూండా ‘నన్ను చంపొద్దు. పోలీసులకు లొంగిపోతానం’టూ మెడలో ప్లకార్డు పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. గౌతమ్ సింగ్ అనే రౌడీ మార్చి 7వ తేదీన ఓ చికెన్ వ్యాపారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 20 లక్షలివ్వాలంటూ బెదిరించాడు. విషయం పోలీసులకు చేరడంతో వారు గౌతమ్ సింగ్ కోసం గాలింపు మొదలెట్టారు. ఈ క్రమంలో కిడ్నాప్‌కు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు గౌతమ్ కోసం రూ. 25 వేల రివార్డును కూడా ప్రకటించారు. దీంతో దొరికితే పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయంతో గౌతమ్ లొంగిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ‘ నన్ను చంపొద్దు. నేను లొంగిపోతున్నాను’ అంటూ రాసి ఉన్న ప్లకార్డును మెడలో వేసుకొని సోదరుడితో కలిసి ఛాపియా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సంతోష్ మిశ్రా మీడియాకు తెలిపారు.