కిడ్నీలు అమ్మే కిరాతకుడు..100 మందిని చంపిన డాక్టర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కిడ్నీలు అమ్మే కిరాతకుడు..100 మందిని చంపిన డాక్టర్ అరెస్ట్

July 30, 2020

Killer Doctor Arrested in Delhi

కిడ్నీలు అమ్ముకునే కిరాతకుడు, డాక్టర్ ముసుగులో మాఫియాను నడిపిన కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వంద మందిని చంపి వాళ్ల కిడ్నీలను అమ్ముకున్న సీరియల్ కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మ (62) ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్య కేసులో పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న అతడు ఈ ఏడాది జనవరిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాత జైపూర్‌లో ఓ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

హర్యానాకు చెందిన డాక్టర్ శర్మ ట్రక్, టాక్సీ డ్రైవర్లును చంపి వారి నుంచి కిడ్నీలు సేకరించే వాడు. ఇలా దాదాపు 100 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత తన పనులను ఆపేశాడు. ఓ హత్య కేసులో అతడు పట్టుబడటంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. దేశంలో కిడ్నీ రాకెట్ల వెనక కూడా ఇతని హస్తం ఉందని తేల్చారు.  2004లో శర్మతో పాటు పలువురు వైద్యులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి శర్మ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.  జనవరిలో 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చి తప్పించుకున్నాడు. 

 ట్రక్ డ్రైవర్లను చంపి వారి కిడ్నీలు తీసుకున్న తర్వాత మృతదేహాలను కాస్గంజ్ సమీపంలోని హజా కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసేవాడు. వాహనాలను కాస్గంజ్‌లో అమ్మేవాడు. లేకపోతే మీరట్‌లో తుక్కుగా విక్రయించేవాడు. ఇలా తాను సేకరించిన కిడ్నీలతో 125 మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 7 లక్షల వరకు వసూలు చేశాడు.