హైదరాబాద్‌లో రూ.40కే కిలో ఉల్లి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో రూ.40కే కిలో ఉల్లి

November 27, 2019

Kilo onion price 40 rupees in hyderabad

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు కిలో ఉల్లిని రూ.40కే విక్రయించేందుకు మలక్‌పేట మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులు అంగీకరించారు. మంగళవారం మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మలక్‌పేట గంజ్ మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులతో చర్చలు జరిపారు. బుధవారం నుంచి మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి వచ్చాయి.

ఒక వినియోగదారుడికి ఒక కిలో చొప్పున విక్రయించనున్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతుబజార్లలో ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. కేంద్రం ఇతర దేశాలకు ఎగుమతులను నిలిపివేసి దిగుమతులు చేసుకుంటున్నది. దిగుమతి చేసుకున్న వాటిలో తెలంగాణకు కూడా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. హమాలీ, రవాణా చార్జీలు ప్రభుత్వం భరించి వినియోగదారులకు రూ.40 చొప్పున అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.