హమ్మయ్య ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మళ్ళీ కనిపించారు. గత కొన్ని నెలలుగా ఆయన కనిపించడం లేదు, ఏమైందో అంటూ అందరూ తెగ ఆదుర్దా పడిపోయారు. మొత్తానికి అందరి ఆలోచనలకు, వదంతులకు చెక్ పెడుతూ కిమ్ కనిపించారు అది కూడా మొత్తం ఫ్యామిలీతో సహా. జనరల్ గా కిమ్ ఎక్కువగా తన ఫ్యామిలీని బయటకు తీసుకురారు. చాలా అరుదుగానే భార్యా, పిల్లలు కనిపిస్తుంటారు. అయితే అధికారిక కార్యక్రమాలకు మాత్రం ఈ మధ్య తరచుగా తన కుమార్తెను వెంటబెట్టకొస్తున్నారు. దీని వెనుక ఏమైనా సంకేతాలున్నాయా అంటూ ప్రపంచ పత్రికలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఆ దేశ మిలటరీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్. దీని తాలూకా ఫొటోలు బయటకు వచ్చాయి. ఉత్తర కొరియాలో సైనిక వ్యవస్థాపక దినానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనికి కుమార్తెను తీసుకురావడం, అక్కడకు వచ్చిన సీనియర్ సైనికాధికారులకు కిమ్ జుయే షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాళ్ళు ఆమెకు వంగి నమస్కారం పెట్టడం ఏవో సంకేతాలను ఇస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ అంటోంది. కుమార్తెను పదేపదే బయటకు తీసుకురావడం ద్వారా దేశ పగ్గాలు తన తర్వాత తన వారసులకే దక్కే అవకాశాలున్నాయన్న సంకేతాలను కిమ్ ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
కిమ్ బయటకు తీసుకొస్తున్న ఆ అమ్మాయి కిమ్ జు యే అని, ఆయన రెండో సంతానమని చెబుతున్నారు. నల్లటి సూట్ ధరించిన ఆమె విందులో తండ్రితో కలిసి పాల్గొన్నారు.కిమ్ జు యేను కిమ్ ప్రియమైన కుమార్తెగా దేశ అధికారిక మీడియా అభివర్ణించింది. అణ్వాయుధ దేశమైన నార్త్ కొరియాను పాలించే వరుసలో కిమ్ జు యే తర్వాతి స్థానంలో ఉన్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ అంటోంది.