దేశంలోని వెనుకబడిన వర్గాలకు ప్రతీ విభాగంలో రిజర్వేషన్లు అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రజాస్వామ్యానికి కీలకమైన న్యాయవ్యవస్థలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తి ‘జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘న్యాయవ్యవస్థలో ప్రస్తుతం అమలులో ఉన్న విధానం, పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు లేవు. కానీ, న్యాయమూర్తులను సిఫారసు చేసేటప్పుడు బీసీలు, మహిళలతో పాటు ప్రాతినిధ్యం లేని వర్గాల వారి పేర్లను సూచించాలని జడ్జీలు, కొలీజియం సభ్యులకు గుర్తు చేశాను’ అంటూ బదులిచ్చారు. దాంతో పాటు న్యాయం ఉచితంగా అందించేందుకు లాయర్ల సంఖ్యను పెంచాలని కోరగా, తాలూకా స్థాయి వరకు ప్రజలకు ఉచితంగా న్యాయసేవలు అందుతున్నాయని స్పష్టం చేశారు