కిరాక్ పార్టీ.. కిక్ మిస్సయింది! - MicTv.in - Telugu News
mictv telugu

కిరాక్ పార్టీ.. కిక్ మిస్సయింది!

March 16, 2018

న‌వ‌త‌రం క‌థానాయ‌కుల్లో  వైవిధ్య‌త‌కు  ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తూ సినిమాలు చేస్తుంటారు నిఖిల్‌. త‌ను ఎంచుకునే ప్ర‌తి క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. ఆ ఆలోచ‌న విధాన‌మే  ఆయ‌న‌కు వ‌రుస విజ‌యాల్ని తెచ్చిపెడుతున్న‌ది. క‌న్న‌డంలో చిన్న సినిమాగా విడుద‌లైన ‘కిరిక్‌ పార్టీ’ చిత్రం నిర్మాత‌ల‌కు ప‌దింత‌ల లాభాల్ని తెచ్చిపెట్ట‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నిఖిల్ న‌టించ‌డానికి అంగీక‌రించ‌డంతో ఇందులో ఏదో వైవిధ్య‌త ఉంద‌ని ప్రేక్ష‌కులు ఆశించారు.  ఇంజ‌నీరింగ్ విద్యార్థుల జీవ‌న శైలిని ఆవిష్క‌రిస్తూ వినోదం, భావ‌ద్వేగాల స‌మాహారంగా రూపొందిన చిత్ర‌ం కిరాక్ పార్టీ.

కృష్ణ (నిఖిల్‌)ఇంజ‌నీరింగ్ విద్యార్థి. కాలేజీలో త‌న మిత్రుల‌తో క‌లిసి ఎప్పుడూ  అల్ల‌రి ప‌నులు చేస్తూ క‌నిపిస్తుంటాడు.. ధైర్యం ఎక్కువే. కాలేజీలో సీనియ‌ర్ అయినా మీరాను (సిమ్రాన్ ప‌రీన్జా)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. మీరా కూడా అత‌డిని ఇష్ట‌ప‌డుతుంది. కృష్ణ త‌న‌  ప్రేమ‌ను మీరాకు తెలియ‌జేయాల‌నుకుంటున్న త‌రుణంలో ఆమె చ‌నిపోతుంది. మీరా దూర‌మైనా ఆమె జ్ఞాప‌కాల్లోనే బ‌తుకుంటాడు కృష్ణ‌. ఇత‌ర అమ్మాయిల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డు. అత‌డి వ్య‌క్తిత్వంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.  అదే కాలేజీలో కొత్త‌గా చేరిన స‌త్య‌(సంయుక్త హెగ్డే) ..కృష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంది. అత‌డి తిరిగి మామూలు మ‌నిషి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. చివ‌ర‌కు త‌ను ఏం కోల్పోయాడో కృష్ణ ఎలా తెలుసుకున్నాడు? త‌న చేసిన త‌ప్పుల‌ను ఎలా స‌రిదిదిద్దుకొని కొత్త జీవితానికి ఏ విధంగా నాంది ప‌లికాడ‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

స‌గ‌టు ఇంజ‌నీరింగ్ విద్యార్థుల మ‌నోభావాల‌ను ప్ర‌తిబింబించే క‌థ ఇది. ఎన్నో క‌ల‌ల‌తో కాలేజీలో అడుగుపెట్టిన వారి జీవితాల్లో క్ర‌మేనా ఎలాంటి మార్పులు వ‌స్తాయి. తొలి సంవ‌త్స‌రంలో బుద్ధిమంతులుగా ఉండే వారు చివ‌రి ఏడాది వ‌చ్చే స‌రికి ఎలా మారుతుంటారు ర్యాగింగ్‌, ప్రేమాయ‌ణాలు, అల్ల‌రి ప‌నులు, స్టూడెంట్ ఎన్నిక‌లు ఇలా ప‌లు అంశాల‌ను ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన చిత్ర‌మిది.  ఎక్క‌డా నాట‌కీయ‌త లేకుండా కాలేజీ వాతావ‌ర‌ణాన్ని స‌హ‌జంగా సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. సీనియ‌ర్స్‌, జూనియ‌ర్స్ మ‌ధ్య గొడ‌వ‌లు, క్యాంప‌స్ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ చ‌క్క‌టి వినోదాన్ని పంచుతాయి. ఎగ్జామ్స్ పాస్ కావ‌డానికి నిఖిల్ బృందం దొంగ‌త‌నంగా చేసే ప‌నులు యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంటాయి. అలాంటివి మ‌రికొన్ని రాసుకుంటే బాగుండేది.

నిఖిల్‌, అత‌డు స్నేహితులు చేసే స‌ర‌దా ప‌నుల‌తో  క‌థ‌ను మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు ఆ ఫీల్‌ను ఆద్యంతం కొన‌సాగించ‌డంలో కొంత త‌డ‌బాటులోన‌య్యారు. మీరా మ‌ర‌ణంతో క‌థ మ‌లుపు తిరిగినా అది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా క‌నెక్ట్ కాదు. నిఖిల్‌, సిమ్రాన్ ప‌రీన్జాల మ‌ధ్య ప్రేమాయ‌ణాన్ని రొమాంటిక్‌గా మ‌ల‌చ‌లేక‌పోయారు. ప్రియురాలు దూర‌మై హీరో ప‌డే ఆవేద‌న, సంఘ‌ర్ష‌ణ స‌రిగా పండ‌లేదు. అలాగే అత‌డిలో మార్పును తీసుకొచ్చే స‌న్నివేశాలు బ‌లంగా లేవు.  హీరో ల‌క్ష్య‌మేమిట‌నేదానిపై క్లారిటీ క‌నిపించ‌దు. ఇలా చిన్న చిన్న లోపాలు సినిమాలో చాలా ఉన్నాయి. ప్రేక్ష‌కుల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ర‌ప్పించే సామ‌ర్థ్యం కాలేజీ ల‌వ్‌స్టోరీల‌కు ఉంది. క‌థ‌కంటే క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంపైనే ఇలాంటి సినిమాల విజయావవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొంత అయోమ‌యానికి లోనైన‌ట్లుగా క‌నిపిస్తుంది. క‌థ న‌డుస్తున్న ఎక్క‌డో ఫీల్ మిస్స‌యినా అనుభూతి క‌లుగుతుంది.

రీమేక్ సినిమాల్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి ద‌ర్శ‌కుడు ఎంతో నేర్పుగా అడుగులువేయాలి. మూల‌క‌థ‌లోని ఆత్మ చెడిపోకుండా మ‌న‌వైన భావోద్వేగాల్ని అన్వ‌యిస్తూ క‌థ చెప్పాలి.  మాతృక‌లోని ఫీల్ ఇక్క‌డ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా క‌థను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయారు ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. ప్ర‌థ‌మార్ధాన్ని కాలేజీ స‌ర‌దాల‌తో న‌డిపించిన ద‌ర్శ‌కుడు ద్వితీయార్ధంలో భావోద్వేగ‌భ‌రితంగా చెప్పే ప్ర‌య‌త్నంలో త‌డ‌బ‌డ్డారు. వినోదాన్ని పండించే  అవ‌కాశం ఉండి కూడా స‌రిగా వినియోగించుకోలేక‌పోయారు. ఈ సినిమాకు సంభాష‌ణ‌ల్ని ద‌ర్శ‌కుడు చందూ మొండేటి అందించగా స్క్రీన్‌ప్లేను మ‌రో ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ స‌మ‌కూర్చారు. ఇలా ముగ్గురు ద‌ర్శ‌కులు ఈ సినిమాకు ప‌నిచేసినా వారి మ్యాజిక్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. చాలా చోట్ల సినిమా హ్య‌పీడేస్‌, ప్రేమ‌మ్‌తో పాటు కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ప‌లు తెలుగు సినిమాల్ని గుర్తుకుతెస్తుంది.

నిఖిల్ మిన‌హా అనుభ‌వ‌జ్జుడైన న‌టులు లేక‌పోవ‌డం ఈ సినిమాకు మ‌రో మైన‌స్‌గా మారింది. త‌న ప‌రిధుల మేర పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి నిఖిల్ చాలా ప్ర‌య‌త్నించారు. భిన్న పార్శ్వ‌ాలున్న పాత్ర‌ల్లో చ‌క్క‌టి వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో విఫ‌ల ప్రేమికుడిగా అత‌డి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. క‌థానాయిక‌లు ఇద్ద‌రూ మెప్పించ‌లేక‌పోయారు. కీల‌క‌మైన మీరా పాత్ర‌లో సిమ్రాన్ ప‌రీన్జా పూర్తిగా తేలిపోయింది. సంయుక్త పాత్ర‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. హీరో స్నేహితులుగా క‌నిపించిన వారిలో హేమంత్‌, రాకేందుమౌళితో పాటు ఇత‌రులు న‌వ్వించారు. సీనియ‌ర్స్‌తో గొడ‌వ‌లు ప‌డే స‌న్నివేశాలు, త‌మ బ్రాంచ్ గొప్ప‌దంటూ ఎవ‌రికి వారు చెప్పుకునే ఎపిసోడ్‌ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. చందూ మొండేటి సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ ఆక‌ట్టుకున్నాయి. నేటి యువ‌తరానికి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌టి డైలాగ్స్‌ను అందించారు. అజ‌నీష్ లోక‌నాథ్  బాణీలు ప‌ర్వాలేద‌నిపించాయి.

మంచి క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాలనే త‌ప‌న‌తో నిజాయితీగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చేసిన ప్ర‌య‌త్న‌మిది. వారి ఆలోచ‌న బాగానే ఉన్నా చిన్న చిన్న లోపాల కార‌ణంగా ఈ సినిమా యావ‌రేజ్ స్థాయిలోనే నిలిచిపోయింది. అయితే  కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చే క‌థ కావ‌డం,యువ‌త‌రాన్ని మెప్పించే హంగులు ఎక్కువ‌గా ఉండ‌టంతో క‌లిసివ‌చ్చింది. ముఖ్యంగా త‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించారు పాస్ మార్కులు తెచ్చుకున్నా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌నే మిగులుస్తుంది.

రేటింగ్: 2.5/5