ఆయన పేరే ఒక యుద్ధం. ఆయన జీవితమే విప్లవం - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన పేరే ఒక యుద్ధం. ఆయన జీవితమే విప్లవం

November 24, 2017

మనిషన్నవాడు చనిపోవాల్సిందే..అతడు మావోయిస్టు అయితే మాత్రం ఒక్కక్షణం కూడా బతకడానికి వీల్లేదు.. ఈ అనధికార శాసనం దశాబ్దాలుగా మనదేశంలో చలామణిలో ఉంది.. అందుకే వందల మంది మావోయిస్టులు మన దేశంలో చనిపోయారు. అలాంటి వాళ్లలోఒకడు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ..

1954 అగష్టు 14 న పెద్దపల్లికి చెందిన మధురమ్మ, వెంకటయ్యలకు మల్లోజుల కోటేశ్వరరావు పుట్టాడు.  ఆదర్శభావాలున్న కుటుంబంలో పుట్టడంతో పాటు పోరుగడ్డ స్ఫూర్తి చిన్నతనంలోనే కిషన్ జీలో సోషలిస్ట్ భావాలను మొలకెత్తించింది.. 1958 నుంచి 1969 వరకు పెద్దపల్లిలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన మల్లోజుల.. చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. 1967 లో భూస్వామ్య పునాదులను వణికించిన నక్సల్ బరి పొలికేకను  1969లో కిషన్ జీ అందుకున్నాడు. పదిహేనో ఏటనే 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు.. మూడు వందల మంది తెలంగాణ బిడ్డలను పొట్టనబెట్టుకున్న రాజ్యహింసపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు.. డిగ్రీ తరువాత 1974లో లా చదవడానికి హైదరాబాద్ వచ్చి అందరిలా సామాన్యంగా ఉండలేకపోయాడు.. రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో చేరాడు. జగిత్యాల, సిరిసిల్ల తాలుకా గ్రామాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాడు.. దొరల భూముల్ని పేదలకు పంచాడు.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రతిఘటించాడు. దోపిడికీ వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రైతులు, కూలీలను చైతన్యపరిచాడు.. కిషన్ జీ కృషి వల్లే 1978లో భారత విప్లవోద్యమ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జగిత్యాల జైత్రయాత్ర అద్భుత విజయం సాధించింది.జగిత్యాల జైత్రయాత్ర తరువాత తెలంగాణ జిల్లాల్లో నిర్బంధం కోరలు చాచింది.. దీంతో పీడిత ప్రజల కోసం అడవి బాట పట్టిన కిషన్ జీ, 1980లో పీపుల్స్ వార్ లో కీలకంగా ఎదిగాడు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, ముక్కు సుబ్బారెడ్డి వంటి యోధులను కాదని చిన్నవయసులోనే మల్లోజులకు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ప్రహ్లాద్ పేరుతో ఆంధ్రప్రదేశ్ బాధ్యతల్ని కిషన్ జీ నిర్వహించాడు. ఆ సమయంలో తెలంగాణలోని ప్రతి పల్లెకు విప్లవ సందేశాన్ని తీసుకెళ్లాడు. కిషన్ జీ కృషితో ఆనాడు ప్రతిపల్లె పోరుకెరటంలా ఉప్పొంగింది. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్ కౌంటర్లు మొదలుపెట్టడానికి ముందు వరకు రైతుకూలీలు, విద్యార్థి, యువజన, కార్మిక, ఉద్యోగి, మేధావి, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లోకి నక్సల్ ఉద్యమాన్ని చేర్చడంలో మల్లోజుల కీలకంగా పనిచేశాడు. 1980 నుంచి 1985 వరకు పీపుల్స్ వార్ పార్టీకి రాజధానిగా హైదరాబాద్ ను మార్చాడు.దండకారణ్య గెరిల్లా జోన్ స్థాపన కోసం విప్లవోద్యమాన్ని బస్తర్ అడవుల్లో విస్తరించడానిక అవసరమైన పునాదిని కిషన్ జీనే వేశాడు. ఉమ్మడి బస్తర్ జిల్లాలో మొదలైన ఈ కృషి అబూజ్ మడ్ అడవుల్లో స్థిరపడడానికి, అటు నుంచి సారండా అడవి మార్గం గుండా  బెంగాల్ జంగల్ మహల్ చేరడానికి బాటలు వేసిన విప్లవవీరుల్లో కిషన్ జీ ఒకరు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా, ప్రజా రాజకీయాలు, ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటం, జనతన సర్కార్ నిర్మాణానికి ఈ కృషే కారణం.

నక్సల్బరి తిరుగుబాటు షావుకారు గుండెల్లో తూటా దించింది. ఎక్కడ చూసినా ఎర్రజెండా రెపరెపలే. రాజ్యానికి బలమెక్కువ. కుట్రలు, నిర్బంధాలతో బెంగాల్ ఎర్రకోట బీటలువారింది. మార్క్స్ వారసులమని చెప్పుకున్న పాలకులే ప్రజాపోరాటాలపై ఉక్కుపాదం మోపారు. భూమి కోసం భుక్తి కోసం సాగుతోన్న పోరాటాన్ని ఎన్ కౌంటర్లు, కోవర్ట్ ఆపరేషన్లతో అణిచివేశారు. అందుకే నక్సల్బరి ఓ జ్ఞాపకంలా మిగిలింది. ఎందరికో కలల ప్రపంచపు పునాదయిన ఆ గుర్తును తిరిగి నిజం చేసిన యోధుడు కిషన్ జీ. రెండు దశాబ్దాల తరువాత బెంగాల్ లో నక్సల్బరికి మళ్లీ జీవం పోశాడు. 1997లో జంగల్ మహల్ లో సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి భూహక్కుల కోసం లక్షలాది ఆదివాసీలను ఏకం చేశాడు. సింగూరు, నందిగ్రాం ఉద్యమాల్లో ప్రజలను నడిపించాడు. చరిత్ర మరిచిపోలేని లాల్ గఢ్ పోరాటానికి నాయకత్వం వహించాడు. దాన్ని విముక్తి ప్రాంతంగా ప్రకటించి భారత రాజకీయాలకు సవాల్ విసిరాడు. బెంగాల్ ప్రజలకు మరో చారుమజుందార్ అయ్యాడు.

నేలతల్లి విముక్తి కోసం దేశ వ్యాప్త విప్లవాన్ని కలగన్న మల్లోజుల అందుకోసం ప్రజల మనిషయ్యాడు.. 2005లో పీపుల్ వార్ మావోయిస్టు పార్టీగా మారడంలో కిషన్ జీ ప్రధానపాత్ర పోషించాడు. గ్రీన్ హంట్ ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్, దంతెవాడ, జగదల్ పూర్, బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ తో పాటు ఒడిశాలో మావోయిస్టు పార్టీ పటిష్ట నిర్మాణానికి కిషన్ జీ వ్యూహాలే కారణం. వీటితో పాటు జార్ఖండ్, బీహార్ లో క్యాడర్ ను అనేక ఎత్తుగడలతో బలోపేతం చేశాడు. ఇలా ఎనిమిది రాష్ట్రాలో ఉద్యమన్ని వెలిగించాడు.. ఎక్కడుంటే అక్కడ వందలాది మందితో ఒక ప్రజాసైన్యాన్ని తయారుచేశాడు.

మావోయిస్టు ఉద్యమానికి టెక్నాలజీని జోడించిన మేధావి మల్లోజుల. శాటిలైట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించిన తొలి విప్లవకారుడు. ఎక్కడికైనా చొచ్చుకెళ్లే చొరవ, ఎంత పెద్ద టార్గెట్ నైనా ఈజీగా ఛేదించే సామర్థ్యం కిషన్ జీ సొంతం. అందుకే ఆయన ఒక్కడి కోసం దేశంలో ఎక్కడా జరగనంత భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు జరిగాయి.. వేలాది పోలీసులు అడవిని జల్లెడబడుతున్నా భయపడకుండా ఒక చేత్తో గన్ను, మరోచేత్తో ల్యాప్ ట్యాప్ పట్టుకుని కూల్ గా మీడియాకు ఇంటర్యూలు ఇచ్చిన ధీరత్వం ఒక్క కిషన్ జీ దే. చరిత్ర నిర్మాణంతో పాటు రచన కూడా సాగాలని కోరుకున్న కిషన్ జీ.. అందుకోసం చివరి వరకు ప్రయత్నించాడు గన్ను పట్టుకున్న చేతితోనే అద్భుతమైన  రచనలు చేశాడు.. భారత విప్లవోద్యమాన్ని పుస్తకాల్లో రికార్డ్ చేయించాడు.

దశాబ్దాల మార్కిస్టు బెంగాల్ కోటను పునాదులతో పెకలించి వేసిన శక్తి కిషన్ జీ. మల్లోజుల పోరాటం వల్ల మొదలైన ప్రభుత్వ వ్యతిరేకతనే బలంగా మార్చుకొని మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. కానీ ఆమె పాలనలోనే కిషన్ జీ ఎన్ కౌంటర్ జరిగింది.. 2011 నవంబర్ 24న పోలీసులు మల్లోజులను చంపేశారు.. ఎప్పటిలాగే ఎన్ కౌంటర్ కథ అల్లారు.. కిషన్ జీది బూటకపు ఎన్ కౌంటర్ అని ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తి అరిచినా లాభం లేకపోయింది.. పెద్దపల్లిలో కిషన్ జీ అంత్యక్రియలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు హాజరై నివాళులర్పించారు.. కిషన్ జీ జీవితమే కాదు మరణం కూడా పాలక వ్యవస్థను వణికించింది.

నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించడం చిన్న విషయం కాదు.. అందుకు ఖలేజా కావాలి.. అలాంటి దమ్మున్న సేనాని కిషన్ జీ… 1982 జనవరిలో కరీంనగర్ జిల్లాలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ నుంచి మొదలుపెడితే నిన్న మొన్నటి ఎదురుకాల్పుల మరణాల్లో ఏ ఒక్కటీ అనివార్యమైంది కాదు.. కానీ ప్రభుత్వాలు రక్తపాతానికే ప్రాధాన్యమిచ్చాయి.. అందుకే మావోయిస్టులు తుపాకులు దించడానికి సాహసించరు.. అలా నెత్తుటి ఆట కొనసాగుతోంది.