ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలకు.. కిషన్‌రెడ్డి వింత వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలకు.. కిషన్‌రెడ్డి వింత వ్యాఖ్యలు

February 18, 2020

Kishan reddy.

తెలంగాణలో రైళ్లు 140 ఏళ్ల కిందటి నుంచే ఉన్నాయి. నిజాం హయాంలోనే రైల్వే లైన్లు పడ్డాయి. ఇంక ఆంధ్రాలో అయితే అంతకుముందు నుంచే ఉన్నాయి. తెలంగాణలో విమాన సర్వీసులు కూడా 70 ఏళ్ళ కిందటే నడిచాయి. కానీ తెలంగాణకే చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం వింతగా, విడ్డూరాతి విడ్డరంగా మాట్లాడారు. ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం వచ్చాకే రైళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలతోపాటు ఘాటు సటైర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

ఈ రోజు సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ ప్రాంతాల్లో నిన్నామొన్నటి వరకు అసలు రైళ్లే లేవన్నారు! ‘రైల్వే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటు లేదు. ఎర్రబస్సు తప్ప వాళ్లకు రైలు తెలియదు. తెలంగాణలో రైల్వే అంటే తెలియదు. ఎర్ర బస్సు తప్ప రైళ్లు, లైన్లు తెలియదు. మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో 48 కొత్త రైళ్లను తీసుకొచ్చాం. దశాబ్దాల పాటు అభివృద్ధి కి నోచుకోని తెలంగాణకు మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు న్యాయం జరుగుతోంది..’ అని అన్నారు. 

Publiée par Satyavathi Satya sur Mardi 18 février 2020

బ్రిటిషర్ల కాలంలో రైల్వేలైన్లు పడ్డాయని, అయితే తర్వాత రైల్వే రంగాన్ని ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదని కూడా ఆయనే అన్నారు. అయితే ఎర్రబస్సు, మోదీ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణలో రైళ్లు అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ వాడే అయివుండే ఇలా మాట్లాడ్డం సిగ్గుచేటని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన కిషన్‌కు కళ్లు నెత్తికెక్కాయని, మోదీ రాకముందు తెలంగాణలో రోడ్లు, బిల్డింగులు లేనేలేవని ఆయన అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.