2023 సంవత్సరంలో మొదటి పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగను వ్యవసాయ పండగ అంటారు. సంక్రాంతిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పేరిట జరుపుకుంటుండగా, తమిళనాట పొంగల్, ఉత్తర భారత దేశంలో లోహ్రీ, మాగ్ బిహు, సక్రత్ వంటి అనేక పేర్లతో పిలుస్తారు.
పండుగ వచ్చిన ప్రతిసారీ దాని తేదీ విషయంలో గందరగోళం ఏర్పడడం మామూలే. ఈసారి కూడా సంక్రాంతి పండుగ జనవరి 14న అని కొందరు జనవరి 15 అని కొందరు అంటున్నారు. కానీ హిందూ క్యాలెండర్ ప్రకారం, సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం పుష్య మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు జరుపుకుంటారు. అయితే ఈసారి ఈ ముహూర్తం రెండు రోజులు ఉండబోతోంది. అందుకే చాలా మంది జ్యోతిష్య పండితులు ఈసారి మకర సంక్రాంతిని జనవరి 15 ఆదివారం జరుపుకోవాలని చెబుతున్నారు.
మకర సంక్రాంతి:
ఈ సంవత్సరం, జనవరి 14, శనివారం రాత్రి 08:21 గంటలకు, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి పండుగ ఆ సమయం నుండి ప్రారంభమై జనవరి 15 ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మకర సంక్రాంతి జరుపుకోవచ్చు. సాధారణంగా సూర్యోదయం సమయానికి ఉన్న మిగులు తిథిని బట్టి జనవరి 15న సంక్రాంతి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
శుభసమయం:
జనవరి 15 మహాపుణ్యకాల ముహూర్తము ఉదయం 7.17 నుండి 9.15 గంటల వరకు ఉంది. ఈ సమయంలో పూజలు చేసుకునేందుకు అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు.ఇక భోగి పండగను జనవరి 14, కనుమ పండుగను జనవరి 16న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం:
ఇక మకర సంక్రాంతికి సంబంధించిన పురాణ విశిష్టతను తెలుసుకుంటే, పురాణాల ప్రకారం, ఉత్తరాయణంలో స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని ఓ నమ్మకం ఉంది. దీనికి సంబంధించిన మహాభారతంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. భీష్ముడు బాణాల అంబశయ్యపై బాధపడుతూ దక్షిణాయణంలో తన ప్రాణాలను త్యాగం చేయకుండా, ఉత్తరాయణ అష్టమి రోజు కోసం వేచి ఉంటాడు. అందుకే ఉత్తరాయణం చాలా పవిత్రమైన కాలమని నమ్ముతారు.
సూర్యుడు తన మార్గాన్ని మార్చుకుని దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళ్లే రోజును ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. దీని ప్రకారం జూన్ 15న దక్షిణాయనం నుంచి ప్రారంభమయ్యే 6 నెలలు ఎక్కువ వెలుతురు, మిగిలిన 6 నెలలు తక్కువ వెలుతురు ఉంటుంది.
అలాగే మకర సంక్రాంతి రోజు బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడు, శివ- పార్వతులు వివాహం చేసుకున్నారు, మహాలక్ష్మి సముద్ర మథనంలో అవతరించింది, ఉత్తరాయణము దేవతలకు చాలా ప్రీతికరమైనది. కాబట్టి సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే ఉత్తరాయణంలో వచ్చే పుష్య మాసంలో శుక్ల పక్ష ద్వాదశి నాడు మకర సక్రాంతి జరుపుకుంటారు.
ఇక్కడ సంక్రాంతి పండుగలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పేదలకు దానం చేస్తే సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. సంక్రాంతి నాడు సూర్య భగవానుడు తన కొడుకు శని ఇంటికి వెళ్తాడని కూడా నమ్ముతారు. అందుకే ఈ రోజున నువ్వులతో చేసిన వంటకాలను తినడం వల్ల సూర్యుడు, శని అనుగ్రహం కలుగుతుందనే నమ్మకం ఉంది.
నువ్వులు తిని మంచిగా మాట్లాడు అని సామెత. ఈ రోజున తమ ప్రియమైన వారికి నువ్వుల బెల్లం పంచిపెట్టే సంప్రదాయం ఉంది. ఆంధ్ర, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి 3 రోజుల పాటు జరుపుకుంటారు. 1 రోజు భోగి, 2 రోజు సంక్రాంతి,3 రోజు కనుమ పండుగ. మొత్తంమీద, ఈ పంట పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు.