3 కోట్లకు ఆశపడి అర కోటి పోగొట్టుకున్న నిజామాబాద్ వాసి - MicTv.in - Telugu News
mictv telugu

3 కోట్లకు ఆశపడి అర కోటి పోగొట్టుకున్న నిజామాబాద్ వాసి

October 10, 2019

అమాయకంగా నమ్మేవాళ్లు వున్నన్ని రోజులు అతితెలివిగాళ్ల ఆగడాలకు హద్దూ అదుపు వుండదు. సోషల్ మీడియా వచ్చాక మోసగాళ్లు  స్మార్టుగా దోచుకుంటే.. బాధితులు అంతకన్నా స్మార్టుగా మోసపోతున్నారు. తేరగా డబ్బు వస్తోందంటే బహుశా కొందరు ఉన్న ఆ కాస్త తెలివిని కూడా మరిచిపోయి బెబ్బేలు అవుతుండొచ్చు. ఓ యువకుడు మూడు కోట్ల రూపాయలు వస్తున్నాయనే ఆశతో రూ.43 లక్షలకు పైనే నిందితుడికి ఆన్‌లైన్ ద్వారా ముప్పజెప్పాడు. అవి కట్టడానికి తండ్రితో పొలం కూడా అమ్మించాడు. ఆ తర్వాత తాను మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు అతడు.  

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన గంగారెడ్డి అనే యువకుడు నగరంలోని ఓ కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. కాచిగూడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఓరోజు గంగారెడ్డి ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. తాము కోకాకోలా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామని.. లాటరీలో మీకు రూ.3 కోట్లు వచ్చాయని మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసుకోగానే మనోడి సంబరం అంతాఇంతా కాదు. మూడు కోట్లా అని ఎగిరి గంతేసి వారికి తన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పంపించాడు. 

lottery.

రెండు రోజుల తర్వాత డాక్టర్‌ నికోలస్‌ పేరుతో గంగారెడ్డికి ఫోన్‌ వచ్చింది. రూ.23వేలు జమ చేస్తే రూ.3కోట్ల చెక్కు పంపిస్తామని ఆగంతకుడు చెప్పాడు. అంతే గంగారెడ్డి అగంతకుడు చెప్పిందే వేదం అన్నట్టు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపాడు. ఇలా 5నెలలుగా సుమారు రూ.43.22లక్షలను గంగారెడ్డి పంపించాడు. తన తండ్రిని నమ్మించి 4 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి మరీ డబ్బు పంపించాడు. కొడుకు ఏదో గట్టిగానే కొడుతున్నాడని పాపం తండ్రి కూడా గుడ్డిగా కొడుకు మాట నమ్మాడు. అడిగినప్పుడల్లా డబ్బు సర్దాడు. పొలం అమ్మి మరి డబ్బు సర్దాడు. ఆ తర్వాత ఆయనకు ఏమూలో చిన్న అనుమానం కలిగింది.

కంపెనీ వారికి ఫోన్‌ చేయమని కొడుకుకు చెప్పాడు. గంగారెడ్డి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో నిండా మునిగిపోయానని గ్రహించాడు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుంటామని అన్నారు.