ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు వంగవీటి రాధా ఒకే వేదికపై కనిపించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నలో జరిగిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వీరందరూ కలిసి పాల్గొన్నారు. అంతకుముందు ఒకే కారులో ఈ నలుగురు నేతలు కలిసి రావడం చర్చనీయాంశమైంది.
కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…
రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్న కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే రంగాను హత్య చేశారని తెలిపారు. పేదల కోసమే తన జీవితాన్ని రంగా త్యాగం చేశారని వెల్లడించారు. నమ్మిన సిద్ధాంతం కోసం రంగా ప్రాణాలర్పించారన్నారు. 1983లో టీడీపీలోకి రంగా శత్రువులు చేరారని..రంగాను భూమి మీద లేకుండా చేయాలని కుట్ర పన్ని హత్య చేశారని ఆరోపించారు. తండ్రి పేరును నిలబెట్టేందుకు రాధా అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. డబ్బు, పదువుల కోసం ఆశపడకుండా నిశ్వార్థంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ రాధాకు సొంత ఇళ్లు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. తండ్రి పేరు నిలబెట్టేందుకు శ్రమిస్తున్న రాధాకు ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి అని వ్యాఖ్యానించారు.
పదవులతో నాకు పనిలేదు
వంగవీటి రంగా అన్ని కులాలకు చెందిన వ్యక్తి అని ఆయన కుమారుడు రాధా తెలిపారు. రంగా చనిపోయి 34 ఏళ్లైనా.. ప్రజల గుండెల్లో ఇంకా నిలిచి ఉన్నారన్నారు. పదవులెన్ని ఉన్నా ఇవ్వలేనంత గౌరవం ఆయన వల్ల దక్కిందన్నారు. “పదువులు ఐదేళ్లు ఉంటాయి తర్వాత పోతాయి.. రంగా కొడుకుగానే జీవితాంతం మీ అభిమానాన్ని సొంతం చేసుకుంటా” అని వంగవీటి రాధా స్పష్టం చేశారు.
రంగా పేద ప్రజల మనిషి
రంగా విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే వల్లభనేని. రంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు తాను, కొడాలి నాని చిన్న వాళ్లమని తెలిపారు. మూడు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న రంగా ఎంతో ఖ్యాతి సంపాదించారని కొనియాడారు.