కోదండరాం దీక్ష విరమణ - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరాం దీక్ష విరమణ

November 1, 2017

తెలంగాణ ప్రభుత్వం తమ సభలను అడ్డుకుంటున్నందుకు నిరసనగా చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను ప్రొఫెసర్ కోదండరాం బుధవారం సాయంత్రం విరమించారు. మధ్యాహ్నం 3గంటలకు విద్యావేత్త చుక్కా రామయ్య, ఆచార్య హరగోపాల్‌, జస్టిస్‌ చంద్రకుమార్‌ లు కోదండరాంకు  నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  కొలువుల కొట్లాట, అమరుల స్ఫూర్తి యాత్రలకు ప్రభుత్వం అనుమతివ్వనందుకు నిరసనగా కోదండరాం దీక్ష చేశారు. ఆయనకు టీడీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. విమరణ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సర్కారును తీవ్రంగా ఎండగట్టారు.

‘గతంలో జేఏసీ మీటింగులకు అనుమతి కోరినపుడు ప్రభుత్వం తిరస్కరించింది. అప్పుడూ నిరసన తెలిపాం. అయినా సర్కారులో మార్పు రాలేదు. ఎక్కడ సభలు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారు. కొలువు కొట్లాటను నగర శివార్లలో జరుపుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. స్థలాల యజమానులను పోలీసులు బెదిరించారు. మేం తీవ్రవాదులమని పోలీసులు కోర్టుకు పచ్చి అబద్ధాలు చెప్పారు’ అని మండిపడ్డారు. యువత ఉద్యోగాలు లేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణలో నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరుతో వేలకోట్లు దుర్వినియోగం చేస్తున్నారని, నీళ్లు ప్రాంతానికి మరో చోటు నుంచి నీళ్లు తెస్తున్నారని ఆరోపించారు. ఈ 5న జేఏసీ విస్తృత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. నిజాం పరిపాలన కన్నా తెలంగాణ ప్రభుత్వం పరిపాలన దారుణం గా ఉందని మండిపడ్డారు.