రాజకీయాలు వ్యాపారం కావొద్దు.. కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాలు వ్యాపారం కావొద్దు.. కోదండరాం

April 2, 2018

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో కొత్త పార్టీ సోమవారం ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో ఆయన ‘తెలంగాణ జన సమితి’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందన్నారు.  ఈ సందర్భంగా ప్రసంగిస్తూ టీఆర్ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు సంధించారు.

‘మా పార్టీ పేరు తెలంగాణ జన సమితి. ఈ నెల 29న హైదరాబాదులో భారీ ఎత్తున తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను నిర్వహిస్తాం. సభ నిర్వహణ కోసం సన్నాహక కమిటీలను నియమించారు. ఆ నెల 4న పార్టీ జెండాను విష్కరిస్తాం. జెండా ఎలా ఉండాలన్నదానిపై పలువురి సూచనలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. టీజేఏసీ ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆకాంక్షలు నెరవేరలేదు..

తెలంగాణ ఉద్యమం ఏ ఆకాంక్షలతో జరిగిందో అవి ప్రస్తుత ప్రభుత్వ పాలనలో నెరవేరడం లేదని కోదండరాం విమర్శాంచరు.  ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని , మంత్రులకు సంబంధం లేకుండానే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ‘ధర్మ0గంట కొట్టినా సీఎం దర్శనం కలగడం లేదు. సెక్రటేరియట్‌కు రాని ముఖ్యమంత్రిని తెలంగాణలోనే చూస్తున్నాం. రాజకీయాలపై మాకు ద్వేషం లేదు. సమాజానికి రాజకీయాలు గుండెవంటివి. అవి వ్యాపారంగా మారకూడదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీని తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రభుత్వం తీరును ఎండగడుతూ జనంలోకి వెళ్తామన్నారు.  

కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకపోతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇంజినీర్ల సలహాలతో కాకుండా కాంట్రాక్టర్ల సలహాలతో నడుస్తోందన్నారు. చాలా గ్రామాల్లో 144 సెక్షన్ నడుస్తోందని, ఇసుక మాఫియా నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఇన్నారెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ప్రొఫెసర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.