అది కోదండరాంకు కొలువు కోసం కొట్లాట - MicTv.in - Telugu News
mictv telugu

అది కోదండరాంకు కొలువు కోసం కొట్లాట

December 2, 2017

టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తనకు ఏదో ఒక రాజకీయ కొలువు కావాలనే కొట్లాడుతున్నాడని, ఆయన నిరుద్యోగుల కోసం పోరాడటం లేదని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరెడ్డి మండిపడ్డారు. ‘కోదండరాం కొలువులపై అసత్య ప్రచారం చేస్తున్నారు.  ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి  కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీచేసింది. మరో 63 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి’ అని ఆయన చెప్పారు.కోదండరాం దివాలాకోరు విధానంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీని నిలదీయకుండా తమనెందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో తీవ్ర నిరుద్యోగానికి కారణమైన కాంగ్రెస్‌తో, బీజేపీలతో ఆయన జట్టుకట్టారని, ఆయన చేస్తున్నది కొలువుల కొట్లాట కాదని, రాజకీయ నిరుద్యోగుల కోసం చేస్తున్న కొట్లాట అని ఎద్దేవా చేశారు.