కోదండరాంతో రేవంత్ భేటీ.. పార్టీ ఏర్పాటుపై చర్చలు! - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరాంతో రేవంత్ భేటీ.. పార్టీ ఏర్పాటుపై చర్చలు!

February 14, 2018

టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాలని ప్రత్యేకంగా  ఆహ్వానించారు. తార్నాకలోని కోదండరాం ఇంటికి వెళ్లిన రేవంత్ కాసేపు తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కోదండరాం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్‌రెడ్డి ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లడం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వానికి దీటైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కోసం రేవంత్ రెడ్డి కూడా యత్నిస్తున్నారు. కలసి వచ్చే శక్తులన్నింటిని కలుపుకుపోతామని చెబుతున్నారు. కోదండరాంతో తాను మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని రేవత్ ట్విటర్లో తెలిపారు.

పార్టీ ఏర్పాటుకు కోదండరాం తీవ్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో రేవంత్ ఆయన వద్దకు వెళ్లడం సహజంగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కోదండరాం పెట్టబోయే పార్టీ గురించి రేవంత్ తెలుసుకున్నారని, దీనిపై కాంగ్రెస్ అభిప్రాయలేంటో ఆయన వివరించారని సమాచారం. విడివిడిగా పోరాడ్డంకంటే విపక్షాలన్నీ కలసికట్టుగా పోరాడితేనే కేసీఆర్‌ను గద్దె దింపొచ్చని రేవంత్ ఇదివరకు పిలుపునివ్వడం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన కోదండరాంను కలుసుకున్నట్లు తెలుస్తోంది..!