బ్రహ్మోత్సవాల వేళ తిరుమల డిక్లరేషన్ వ్యవహారం మరింత ముదిరింది. అటు వైకాపా, ఇటు టీడీపీ, బీజేపీ పార్టీలు తిరుమల కేంద్రంగా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీపై విమర్శలు సంధిస్తూ ఏకంగా ప్రధాని మోదీ భార్యను కూడా ఈ రచ్చలోకి లాగారు. డిక్లరేషన్, సతీసమేతంగా స్వామి దర్శనం అంశాలపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘మోదీ తన భార్యతో కలిసి వస్తారా? జగన్ తన భార్యతో తిరుమలకు వెళ్తే టీడీపీ, బీజేపీకి ఎందుకు అభ్యంతరం? బీజేపీ నాయకుల కారణంగా మోదీ బజారునపడుతున్నారు. జగన్ భార్య గురించి మాట్లాడేవాళ్లు మోదీని భార్యతో సహా గుళ్లకు రమ్మనండి..’ అని అన్నారు. జగన్ తిరుమలలో డక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించడం తెలిసేందే. దీంతో బీజేపీ, టీడీపీలు విమర్శలు సంధిస్తున్నాయి. జగన్కు వెంకన్నపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి, సతీసమేతంగా స్వామికి పట్టుబట్టలు పెట్టాలన్న విపక్షాల డిమాండుపై నాని స్పందించారు. తమ సీఎంకు కులమతాల భేదం లేదని, గుడిలో హిందువులా, చర్చిలో క్రైస్తవుడిలా, మసీదులో నవాబులా ఉంటాడని చెప్పుకొచ్చారు. వెంకన్నను దర్శించుకోడానికి డిక్లరేషన్ అక్కర్లేదని, స్వామిపై విశ్వాసంతోనే భక్తులు తిరుమలకు వెళ్తున్నారని అన్నారు. అయితే ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమని, దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని కూడా ఆయన పేర్కొన్నారు.