కొడుకుతో గొడవ.. కోడెల ’ఆత్మహత్య’ వెనుక!  - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకుతో గొడవ.. కోడెల ’ఆత్మహత్య’ వెనుక! 

September 16, 2019

Kodela siva Prasad argument with his son 

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ‘ఆత్మహత్య’ కలకలం రేపుతోంది. అవినీతి కేసులకు తోడు, కొడుకుతో గొడవ, అనారోగ్యం.. అన్నీ కలిసి ఆయనను ఆత్మహత్యవైపు నెట్టినట్లు తెలుస్తోంది. కోడెల ఉరేసుకున్నారని, కాదు, విషపు ఇంజెక్షన్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోలేదని ఆకస్మిక గుండెపోటుతో చనిపోయారని కూడా కథనాలు వస్తున్నాయి. ఆయన ఎలా చనిపోయాడో బసవతారం వైద్యులు ఇంకా వెల్లడించలేదు. పోస్టుమార్టం తర్వాతే అసలు కారణం తెలుస్తుందంటున్నారు.

కొంతకాలం కిందట కోడెల గుండెపోటుతో బాధపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కోడెలపై, ఆయన కుటుంబ సభ్యులపై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సైతం ఇంటికి తీసుకెళ్లడం వివాదం రేపింది.  ఏపీ వ్యాప్తంగా పలువురు బాధితులు కోడెల కుటుంబం తమకు అన్యాయం చేసిందని ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కేసులపై గొడవ పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొడుకు శివరామకృష్ణతో మాటామాటా పెరిగిందని, ఆవేదనతో ఆయన గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. శివరామకృష్ణ ఒక దశలో తండ్రిపై చెయ్యి కూడా చేసుకున్నాడని, తర్వాత కోడెల గదిలోకి వెళ్లి తాళం పెట్టుకున్నాడని చెబుతున్నారు. గొడవ తర్వాత కుటుంబ సభ్యులు ఆయన అపస్మారక స్థితిలో బసవతారం ఆస్పత్రిలో చేర్పించారు.