కోడికత్తి కేసు.. సీజేఐకి నిందితుడి తల్లి లేఖ
ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్‌ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. జగన్‌మోహన్ రెడ్డిపై జరిపిన కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్ నిందితుడిగా ఉన్నారు.
2019లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. అక్టోబరు 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు.. జగన్‌పై కోడికత్తితో దాడి చేయగా, సంఘటనా స్థలంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫీ తీసుకునే సాకుతో జగన్ వద్దకు వెళ్లిన నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో దాడిచేశాడు. వెంటనే అప్రమత్తమైన జగన్ భద్రతా సిబ్బంది.. ఆయనను తప్పించారు. అయితే ఈ కేసులో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్ఐఏ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిపై చార్జిషీటును విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. కానీ ఈ కేసులో కోర్టు ఎలాంటి విచారణ జరపడం లేదని శ్రీనివాస్ తల్లి సావిత్రి ఆరోపణ.