ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం భారత్‌లో లభ్యమైన విషయం తెలిసిందే. దక్కన్ ప్రాంతం నుంచి అనేక మంది రాజుల చేతులు మారిన ఈ అరుదైన వజ్రం చివరికి అప్పటి బ్రిటన్ రాజవంశం చేతుల్లోకి వెళ్లింది. అప్పటినుంచి వారి కిరీటంలో కలికితురాయిగా వెలుగొందుతూ వస్తోంది. అయితే ఇటీవల క్వీన్ ఎలిజబెత్ 2 మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఎలిజబెత్ రాణి కోహినూర్ వజ్రాన్ని తన కిరీటంపై ధరించారు. ఆమె స్థానంలో రాజుగా చార్లెస్ 3 మరో మూడు నెలల్లో పట్టాభిషిక్తుడువుతున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. రాజు భార్య కెమిల్లా కిరీటంలో కోహినూర్ ధరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆమె క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్‌కి చెందిన నగలను పొదుగుతారు. అయితే ఈ నిర్ణయానికి రావడానికి కారణం మాత్రం భారతదేశమేనంట. మన దేశంతో దౌత్యపరమైన సమస్యలు రాకుండా నివారించేందుకే కోహినూర్ ధరించకూడదని కెమిల్లా డిసైడ్ అయ్యారని సమాచారం. తాజా పరిణామంతో కోహినూర్‌ని స్వదేశానికి తీసుకురావడానికి ఒక మెట్టు ఎక్కినట్టేనని భారతీయులు భావిస్తున్నారు. ఇక మనతో పాటు మరికొన్ని దేశాలు కూడా కోహినూర్ తమదేనని వాదిస్తున్నాయి. అందుకు ఆధారంగా రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.