సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత ఇప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ పక్రియ మొదలెట్టాయి. ఇందులో భాగంగా దశల వారీగా దుకాణాలు తెరచుకోవడానికి అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28 నుంచి సెలూన్లు, బ్యూటీపార్లర్లు తెరవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో కొల్హాపూర్‌కు చెందిన రాంభూ సంకల్ప్ అనే సెలూన్ యజమాని కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సెలూన్ కు వచ్చే తొలి కస్టమర్‌కు బంగారు కత్తెరలతో హెయిర్ కట్ చేశాడు.
ఆదివారం రోజున తన సెలూన్‌కు వచ్చిన తొలి కస్టమర్‌కు సంకల్స్ బంగారు కత్తెరలతో హెయిర్ కట్ చేశాడు. ఈ సందర్భంగా సంకల్ప్ మాట్లాడుతూ..’లాక్డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా రాష్ట్రంలో సెలూన్ షాపులు మూతబడ్డాయి. దీంతో సెలూన్ నిర్వాహకులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేని కొందరు బార్బర్ షాపు యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. సెలూన్లకు అనుమతించడం సంతోషంగా ఉంది. అందుకే ఇప్పటివరకూ నేను దాచుకున్న డబ్బుతో పది తులాల బరువైన రెండు జతల బంగారు కత్తెరలను కొనుగోలు చేశాను. మా సెలూన్ తిరిగి తెరుచుకోవడంతో పాటు తోటి సెలూన్ నిర్వాహకుల సంతోషాన్ని వ్యక్తం చేసేందుకే తొలి కస్టమర్‌కు హెయిర్ కట్ చేసేందుకు బంగారు కత్తెర్లను ఉపయోగించాను.’ అని తెలిపాడు.