ఓడరేవు కాదు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్.. ముంచెత్తిన అంఫాన్
అంఫాన్ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్ గజగజ వణికిపోతోంది. తీవ్రమైన ఈదురు గాలులకు తోడు వర్షం కారణంగా చాలా చోట్ల విధ్వంసం జరిగింది. దీని ప్రభావం కోల్‌కతా అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు తగిలింది. భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎటు చూసినా నీరే దర్శనమిస్తోంది. రన్ వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీనికి తోడు ఎయిర్‌పోర్టులోని పలు నిర్మాణాలు విరిగిపడి కనిపించాయి. దీంతో అధికారులు కార్గోసేవలను తాత్కాలికంగా నిలిపివేసి సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రజలు ఎవరూ బయటకు రాకపోవడంతో కోల్‌కత్తా అంతా నిర్మానుషంగా మారిపోయింది.
#WATCH West Bengal: A portion of Kolkata Airport flooded in wake of #CycloneAmphan pic.twitter.com/28q5MdqoD2
— ANI (@ANI) May 21, 2020
రోడ్లపై చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వేలాది ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. తీర ప్రాంతం వెంబడి భారీగా నష్టం జరిగింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 5 లక్షల మంది ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాాగా తుపాన్ వల్ల ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సీఎం మమతా బెనర్జీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూనే ఉన్నారు. కాగా ప్రస్తుతం దేశంలో వణికిస్తున్న కరోనా కంటే అంఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ తుపాను అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.