ఎంపీతో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీతో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. 

September 15, 2020

Kolkata: Cab driver passes lewd remarks at TMC MP Mimi Chakraborty; arrested

కోల్‌కతాలో తృణమూల్‌‌ కాంగ్రెస్‌ ఎంపీ, హీరోయిన్‌ మిమి చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. కారులో వెళ్తున్న ఆమెను ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫాలో చేస్తూ అసభ్యకరంగా సైగలు చేశాడు. దీంతో ఆమె అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం జిమ్‌ నుంచి ఎంపీ మిమి చక్రవర్తి తన కారులో తిరిగి వస్తున్నారు. గరియాహట్‌ వద్దకు రాగానే ఓ ట్యాక్సీ డ్రైవర్‌ ఆమె కారును వెంబడించాడు. అంతేకాకుండా ఆసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా అతడు ఆమె కారు పక్కనే తన ట్యాక్సీని తీసుకువచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే మొదట ఆమె దీనిని పట్టించకోకుండా తన దారిన తాను వెళ్లిపోయారు. అయితే సదరు డ్రైవర్‌ మళ్లీ తన కారును ఓవర్‌ టేక్‌ చేసి అదే తరహాలో ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని మెట్రో పాలిటన్‌ బైపాస్‌ సమీపంలోని ఆనందపూర్‌కు చెందిన 32 ఏళ్ల లక్ష్మణ్‌ యాదవ్‌గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్‌ 354,354ఎ,354డి, 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎంపీ మాట్లాడుతూ.. ‘జిమ్ నుంచి బయలుదేరిన నా కారును ఓ ట్యాక్సీ వెంబడించడం గమనించాను. అయితే ఆ డ్రైవర్‌ నా వైపు చూస్తూ అసభ్యకరంగా సైగ చేశాడు. మొదట అది నేను పట్టించుకోకుండా నా కారు వేగంగా ముందుకు పోనిచ్చాను. అతడు నా కారును అతి వేగంగా ఓవర్‌ టేక్‌ చేసి మళ్లీ అదే తీరుగా సైగ చేశాడు. ఇప్పుడు నేను అతడిని వదిలేస్తే ఆ తర్వాత అతడి ట్యాక్సీలో ప్రయాణించే మరికొందరు స్త్రీలను వేధిస్తాడు. అది సురక్షితం​ కాదని ఆలోచించాను. వెంటనే అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని ఆమె తెలిపారు.