టీం ఇండియా పేస్ బౌలర్ షమీకి, తన మాజీ భార్య హసీన్ మధ్య కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2018లో విభేదాలు రావడంతో ఇరువురు విడిపోయారు. ఈ క్రమంలోనే షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేస్తూ.. కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది.ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లినప్పుడల్లా క్రికెటర్, అతని కుటుంబం తనను హింసించారని హాసిన్ జహాన్ ఆరోపించింది . షమీ వేర్వేరు ఫోన్ నంబర్లను ఉపయోగించి తనను ఫోన్లో బెదిరిస్తున్నాడని పేర్కొంది. అయితే షమీ జహాన్ వాదనలను ఖండించారు. తనపై ఆరోపణలు అవాస్తవమని, తన పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని ఆరోపించాడు.
తాజాగా ఈ కేసులో కోల్ కతా కోర్టు తీర్పను వెల్లడించింది. మాజీ భార్య హసీన్ జహాన్‌కు ప్రతినెల రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇందులో 50 వేలు మాజీ భార్య ఖర్చుల నిమిత్తం కాగా..మిగతా రూ.80 వేలు వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు తీర్పనిచ్చింది. అయితే ఈ తీర్పుపై హసీన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఖర్చుల కోసం రూ.7 లక్షలు, కుమార్తెని చూసుకునేందుకు రూ.3 లక్షలు.. మొత్తం ప్రతి రూ.10 లక్షలు కావాలని 2018లో హసీన్ కోర్టుని ఆశ్రయించింది. ఇప్పుడు కోర్ట్ మాత్రం నెలకు రూ.50 వేలని మాత్రం తీర్పివ్వడంతో హసీన్.. ఈ కేసు విషయమై హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.