ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా వెళ్లడానికి సిద్దమవుతారు. అయితే ఒక ఫుడ్ వెబ్ సైట్ ప్రకారం ప్రపంచంలో 11 ఆహార గమ్యస్థానాల లిస్ట్ విడుదల చేసింది. అందులో ఏకైక భారతీయ నగరం కోల్ కత్తా స్థానం సంపాదించుకుంది.
‘యమహానగరి.. కలకత్తా పురి..’ అని పాటలు కట్టి పాడడం విన్నాం. అయితే కోల్ కత్తా 2023 జాబితాలో ప్రపంచంలోని అత్యుత్తమ ఫుడ్ డెస్టినేషన్ గా పేరు కాంచింది.
ఫుడ్ వెబ్ సైట్ ఈటర్ 11 వంటల గమ్యస్థానాల జాబితాను విడుదల చేసింది. కోల్ కత్తా కాకుండా టమాకి మకౌరా (న్యూజిల్యాండ్), ఆషివిల్లే (నార్త్ కరోలినా), అల్బుకెర్కీ (న్యూ మెక్సికో), గ్వాటెమాల సిటీ (గ్వాటెమాల), కేంబ్రిడ్జి (ఇంగ్లండ్) ఇతర నగరాల లిస్ట్ లో చేరాయి.
కోల్ కత్తాకు వెళ్లి నోరూరించే వంటకాలు ప్రయత్నించిన వారికి ఈ వార్త ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం, తూర్పు భారత నగరం, శతాబ్దలుగా వివిధ సంస్కృతులకు సమ్మేళనంగా ఉంది. ఫలితంగా నగరం అద్భుతమైన బెంగాలీ వంటకాలను కలిగి ఉండడమే కాకుండా ఆంగ్లో ఇండియన్, అర్మేనియన్, మొఘలాయ్ రుచికరమైన
వంటకాలను కూడా అందిస్తుంది. ఈ సందర్భంగా కోల్ కత్తాలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ మీకు పరిచయం చేస్తున్నాం.
కటీ రోల్
కోతి రోల్
ఇవి కేవలం భారతదేశం అంతటా దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ స్పెషల్ వేరేలా ఉ:టుంది. చికెన్ లేదా మటన్ కబాబ్లతో నింపేసి ఉంటాయి. ఫ్లాట్ బ్రెడ్ లను తేలికగా వేయించి ఈ మసాలాలను, నిమ్మరసంతో మేరినేట్ చేస్తారు.
ఫుచ్కా
ఫుచ్కాలు తినకుండా కోల్ కత్తా పర్యటన పూర్తి కాదు. వీటినే మనం పానీపూరీ అంటాం. చింతపండు రుచిగల నీటితో నింపిన చిన్న పూరీలు ఉంటాయి. ఇందులో ఉడికించిన ఆలుగడ్డ గుజ్జును నింపుతారు. మధ్యాహ్నం పూట ఇవి తినడానికి అక్కడ ఎక్కువ ఇష్టపడుతారు.
కోల్ కత్తా బిర్యానీ
మాంసాహారులకు ఇది స్వర్గధామం అని చెప్పొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో దొరికే బిర్యానీకి ఇది భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. బాస్మతీ బియ్యం, మాంసం కలయికనే కాదు.. పక్కన ఉడికించిన గుడ్డు, ఆలుగడ్డలను కూడా వడ్డిస్తారు. దీన్ని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
టెలి భాజా
డీప్ ఫ్రైడ్ ఇష్టపడే వాళ్లకు ఇది చాలా బాగా నచ్చుతుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పకోడీలు అని పిలుస్తారు. కూరగాయాలు, మాంసం పిండిలో ముంచి డీప్ ఫ్రై చేస్తారు. దీంతో వేడిగా ఒక కప్పు చాయ్ తాగితే ఆహా ఏమి రుచి అనకమానరు.
ఘుగ్ని
ఎండిన బఠానీలతో తయారు చేయబడిన రుచికరమైన చిరుతిండి ఇది. ఈ వంటకం అనేక రకాల కూరగాయాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు వండిన బఠాణీలను కలుపుతారు. ప్రయాణం చేసేటప్పుడు తినడానికి బెస్ట్ చాయిస్.
డైమర్ డెవిల్
కోల్ కత్తా స్కాచ్ ఎగ్ వెర్షన్ ఇది. కోడిగుడ్డును ఉడికిస్తారు. మాంసం, ఆలుగడ్డల మిశ్రమంతో కోడిగుడ్డుకు పై పూత పూస్తారు. వీటిని డీప్ ఫ్రై చేస్తారు. సాస్ లతో పాటు తింటే యమ టేస్టీగా ఉంటాయి.